సినిమా చూడ్డానికి థియేటర్‌కి వెళ్తే బయటకు పంపారు: అవికా గోర్‌

7 Jan, 2024 10:32 IST|Sakshi

అవికా గోర్‌..‘చిన్నారి పెళ్లికూతురు’ ఆనందిగా ఫేమస్‌. ఇటు స్మాల్‌ స్క్రీన్‌.. అటు సిల్వర్‌ స్క్రీన్‌ రెండిట్లోనూ చిన్నప్పటి నుంచే నటించడం మొదలుపెట్టింది. నటిగా ఎన్నో విజయాలందుకున్న ఆమె.. ప్రస్తుతం వెబ్‌స్క్రీన్‌ మీదా అలరిస్తోంది.  

ముంబైలో పుట్టిపెరిగిన అవికా గోర్‌.. పదేళ్ల వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. స్కూల్‌లో కంటే షూటింగ్‌ సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడిపింది.  

‘బాలికా వధు’ సీరియల్‌ అవికా జీవితాన్నే మార్చేసింది. ఆ సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంది. ఇదే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురి’గా ప్రసారమైంది.

‘రాజ్‌కుమార్‌ ఆర్యన్‌’, ‘ససురాల్‌ సిమర్‌ కా’ అనే సీరియల్స్‌లోనూ నటించింది. తర్వాత సినీ అవకాశాలు రావడంతో పూర్తిగా వెండితెర మీదే దృష్టి పెట్టింది.

హిందీలో వరుసగా ‘తేజ్‌’, ‘పాఠ్‌శాలా’ సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెరపై వచ్చిన గుర్తింపు వెండితెరపై రాలేదు. తొలిసారి ‘ఉయ్యాల జంపాల’ అనే తెలుగు చిత్రంతో ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. 

  ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాల్లో నటించింది. కానీ, తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. 

లాక్‌డౌన్‌లో.. జీ5లో డైరెక్ట్‌గా రిలీజ్‌ అయిన ‘నెట్‌’ సినిమా అవికాను డిజిటల్‌ ప్రేక్షకులకు పరిచయం చేసింది. అక్కడ మంచి ఆదరణ లభించడంతో, మళ్లీ అవికా కెరీర్‌ పుంజుకుంది. 

ప్రస్తుతం అవికా.. డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్‌లో హిట్‌టాక్‌తో స్ట్రీమింగ్‌లో ఉన్న ‘వధువు’ అనే థ్రిల్లర్‌ సిరీస్‌తో అలరిస్తోంది . 

ఒకసారి ముంబైలోని ఒక థియేటర్‌లో సినిమా చూడ్డానికి నేను మేజర్‌ని కాదని నన్ను అనుమతించలేదు. నా ఐడీ చూపించి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ చాలామంది నన్ను చిన్నపిల్లలాగే చూస్తుంటారు. చెప్పొద్దూ.. అలా ట్రీట్‌ చేస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది.  – అవికా గోర్‌ 

>
మరిన్ని వార్తలు