సెకండ్‌ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు

4 May, 2023 01:19 IST|Sakshi

‘‘గతంలో నేను చేసిన ‘శివరామరాజు’ చిత్రం అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూశాక విడిపోయిన 24 కుటుంబాలు మళ్లీ కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. గోపీచంద్, డింపుల్‌ హయతి జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీలో కీలక పాత్ర చేసిన జగపతిబాబు విలేకరులతో చెప్పిన విశేషాలు.

► ఇండస్ట్రీలో ఇప్పుడు హారర్, యాక్షన్, థ్రిల్లర్‌  సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి... సెంటిమెంట్‌ తగ్గింది. నెగిటివిటీ పెరిగింది. సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత బావుంటోంది.. అందుకే నేను సక్సెస్‌ అయ్యాను (నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీ లోనూ పాజిటివిటీ ఉందని చెప్పడానికి ‘రామబాణం’ వస్తోంది.

► సెకండ్‌ ఇన్నింగ్స్‌లో నేనిప్పటి వరకూ 70కిపైగా పాత్రలు చేశా. అయితే చెప్పుకోడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. కొందరు నన్ను  సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘రామబాణం’ విషయంలో అలా కాదు. ఈ చిత్రాన్ని  బలంగా మలిచాడు శ్రీవాస్‌. ఇందులో ఆర్గానిక్‌ ఫుడ్‌ ప్రాధాన్యతని చక్కగా చూపించాం.

► నేను హీరో కాదు.. విలన్‌ కాదు.. యాక్టర్‌ని. అందులోనూ డైరెక్టర్స్‌ యాక్టర్‌ని. మన నుంచి వాళ్లు ఏం రాబట్టుకోవాలనుకుంటున్నారో వారి కళ్లు చూస్తే అర్థమౌతుంది. నాకు ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్‌ కాదు. పాత్ర నచ్చకపోతే  కుదరదని చెబుతున్నాను.

► సెకండ్‌ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది. హీరో అనేది పెద్ద బాధ్యత.. ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో నటనపైనే దృష్టి పెడుతున్నాను.

► చిన్న సినిమా అనేది ఉండదు. హిట్‌ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు.. పాత్ర, సినిమా ముఖ్యం. సల్మాన్‌ ఖాన్‌తో చేసిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ తర్వాత బాలీవుడ్‌ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాడ్‌ ఫాదర్‌ లాంటి పాత్ర చేయాలని ఉంది. అలాగే ‘గాయం’కి మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగైదు సినిమాలు పెద్ద బ్యానర్స్‌లోనివే.

మరిన్ని వార్తలు