‘మా ఇద్దరిని కలపడానికి ఓ గదిలో పెట్టి తాళం వేశారు’

21 Apr, 2021 15:39 IST|Sakshi

తనకు, శ్రీదేవికి మధ్య కోల్డ్‌వార్‌పై స్పందించిన జయప్రద

ఇండియన్‌ ఐడిల్‌ వేదికగా ఆసక్తికర విషయాలు వెల్లడి

అందాల తార శ్రీదేవి బాల నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండియాలోనే టాప్‌ హీరోయిన్‌గా నిలిచారు. అప్పటికే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌లుగా వెలుగొందుతున్న జయప్రద, జయసుధలకు.. అటు బాలీవుడ్‌లో మాధురీ దీక్షిత్‌కు గట్టి పోటీ ఇచ్చారు శ్రీదేవి. ఆ తర్వాత ఆమె ఇండియాలోనే నంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఇక శ్రీదేవికి, జయప్రదకు మధ్య ఉన్న కోల్డ్‌ వార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం కానీ.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడం కానీ చేసేవారు కాదు.

ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ఎందరో ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన కోల్డ్‌ వార్‌కు సంబంధించిన విశేషాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ సారి ఏకంగా జయప్రదనే దీనిపై స్పందించారు. ఇండియన్‌ ఐడల్‌ 12కు గెస్ట్‌గా వచ్చారు జయప్రద. ఈ వేదిక మీద ఆమె తనకు, శ్రీదేవికి మధ్య నడిచిన కోల్డ్‌ వార్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. 

జయప్రద మాట్లాడుతూ.. ‘‘ఇలా చెప్పడానికి నేనేం బాధపడటం లేదు. అలా అని మేం ఇద్దరం ఎప్పుడైనా గొడవ పడ్డామా అంటే అది లేదు. కాకపోతే మా ఇద్దరి మధ్య కెమస్ట్రీ మ్యాచ్‌ కాలేదు. పైగా అప్పటికే మేం ఇద్దరం టాప్‌ హీరోయిన్లం. నేనేందుకు తగ్గాలంటే.. నేనేందుకు తగ్గాలి అని ఇద్దరం ఫీల్‌ అయ్యే వాళ్లం. ఎలా ఉండేవాళ్లం అంటే మా ఇద్దరి మధ్య ఐ కాంటాక్ట్‌ కూడా ఉండేది కాదు’’ అంటూ గుర్తు చేసుకున్నారు.

‘‘ఇక ప్రతి విషయంలో మేం ఒకరి మీద ఒకరం పోటీ పడుతుండేవాళ్లం. డ్రెస్సులు, డ్యాన్స్‌లు ఇలా అన్ని విషయాల్లో ఒకరిపై ఒకరం పై చేయి సాధించాలని ట్రై చేసే వాళ్లం. తెర మీద మంచి అక్కాచెల్లళ్లలా కనిపించినప్పటికి.. వాస్తవంగా కనీసం పరిచయం ఉన్నవారిలా కూడా ఉండేవాళ్లం కాదు. మేం ఇద్దరం ఎదురుపడిన ప్రతిసారి దర్శకులు, తోటి నటులు మమ్మల్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసేవారు. అప్పుడు మాత్రం హలో అని పలకరించుకుని ముందుకు వెళ్లిపోయేవాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చారు జయప్రద

ఇక తమ ఇద్దరిని కలపడానికి చాలా మంది ప్రయత్నించారని.. వారిలో రాజేశ్‌ కుమార్‌, జితేంద్ర ఖన్నా కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు జయప్రద. ‘‘ఒకసారి షూటింగ్‌ లంచ్‌ టైంలో రాజేశ్‌ కుమార్‌, జితేంద్ర మా ఇద్దరిని ఒకే రూమ్‌లో పెట్టి తాళం వేశారు. దాదాపు గంటసేపు అలానే ఉంచారు. అలా అయినా మేం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటామని భావించారు. గంట తర్వాత తలుపు తీసి చూస్తే.. మేం ఇద్దరం ఆ పక్క ఒకరం.. ఈ పక్క ఒకరం కూర్చుని ఉన్నాం. ఆ తర్వాత ఇద్దరం బయటకు వెళ్లిపోయాం’’ అని చెప్పుకొచ్చారు జయప్రద.

చదవండి:
'అమ్మాయ్‌... చింపి.. చింపి.. చంపి పడేశావ్'‌
ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు