నా కష్టసుఖాల్లో ఉన్నది ఆ ఇద్దరే: ఎన్టీఆర్‌

22 Mar, 2021 00:02 IST|Sakshi

‘‘నాకు 20 ఏళ్ల నుంచి దేవుడిచ్చిన శక్తి మీరైతే (ఫ్యాన్స్‌).. నాకు దేవుడిచ్చిన కుటుంబం, నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం మా కీరవాణి, జక్కన్న (రాజమౌళి) కుటుంబం’’ అని హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. చిత్రా శుక్లా, మిషా నారంగ్‌ కథానాయికలుగా నటించారు. మణికాంత్‌ దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయిలు అభయ్, భార్గవ్‌ వారికి ఇష్టం వచ్చిన రంగంలో ఏదైనా సాధించిన రోజు వాళ్ల గురించి నేను మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగానూ, బ్లాంక్‌గానూ ఉంటానో.. నా తమ్ముళ్లు భైరవ, సింహా సాధించిన విజయం, స్థానం గురించి మాట్లాడటానికి మాటలు, పదాలు సమకూర్చుకోలేకపోతున్నా. వాళ్లిద్దర్నీ చూసి ఈరోజు నేనెలా ఫీలవుతున్నానో భవిష్యత్తులో అభయ్, భార్గవ్‌లను చూసి ఇంతే ఆనందపడతానేమో.

నా మంచీ చెడుల్లో, కష్ట సుఖాల్లో, నా ప్రతి నిర్ణయం వెనకాల పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఉన్న ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్నలదే. ‘తెల్లవారితే గురువారం’ తో మా భైరవ, మా సింహా ఇంకో మెట్టు పైకి ఎదిగాలని, మణికాంత్‌ హిట్‌ అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

ఇంకా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ –‘‘వేగంగా పరిగెడుతున్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లల్ని ఎలా పెంచాలి అనేది పెద్ద టాస్క్‌. మనం మంచి పేరెంట్స్‌ ఎలా అవుతాం అనే డౌట్‌ నాకు, ప్రణతి (ఎన్టీఆర్‌ భార్య)కి రోజూ వస్తుంటుంది. ఎలా చేద్దాం అనిపించిన ప్రతిసారీ నాకు గుర్తొచ్చేది ఇద్దరే.. మా శ్రీవల్లి, రమగార్లు. ప్రతి కొడుకు విజయం వెనకాల ఓ తల్లి ఉంటుంది. నా పిల్లలకు మంచి ఉదాహరణలు కాలభైరవ, సింహా, కార్తికేయ. వీళ్ల సక్సెస్‌కి కారణం శ్రీవల్లి, రమగార్లు’’ అన్నారు.

డైరెక్టర్‌ రాజమౌళి మాట్లాడుతూ –‘‘బయటివారు ఎలా చేశారో ఈజీగా చెప్పేస్తుంటాం.. కానీ ఇంట్లో పిల్లల గురించి చెప్పాలంటే టెన్షన్‌గా ఉంటుంది. మా పిల్లలు బాగానే చేశారనిపిస్తుంటుంది. కానీ ఎలా చేశారన్నది సినిమా చూశాక మీరు చెప్పాలి. కాలభైరవ విషయంలో నాకు టెన్షన్‌ లేదు. క్లాస్, మాస్‌ సాంగ్స్‌ ఇరగ్గొట్టేస్తున్నాడు. చిన్నోడు కాబట్టి శ్రీసింహాకి కొంచెం భయం.. మీరు తొందరగా ఆ భయాన్ని పోగొడతారని ఆశిస్తున్నా. ఈ సినిమాని నిర్మాతలు గ్రాండ్‌గా నిర్మించారు.. మొదటి సినిమా అయినా మణికాంత్‌ బాగా తీశాడు.  సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు.

సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ –‘‘తండ్రులు రెండు రకాలుంటారు.. వారిలో గూగుల్‌ మ్యాప్‌ ఫాదర్స్‌ ఒకరు.. అలా వెళ్లు, ఇలా వెళ్లు అంటూ పిల్లలకు గైడెన్స్‌ ఇస్తుంటారు. కానీ నేను నా పిల్లల కెరీర్‌ తొలి నాళ్లలో ఏం చేయాలో చెప్పానంతే.. ఇప్పుడు వారి పనిలో కల్పించుకోవడం లేదు’’ అన్నారు. ‘‘మీరందరూ వచ్చి మా సినిమా ‘అదుర్స్‌’ అంటే చాలు’’ అన్నారు మణికాంత్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు