Kangana Ranaut: బాలీవుడ్‌ గీత రచయితకు ఎదురుదెబ్బ!

26 Jul, 2021 17:35 IST|Sakshi

బాలీవుడ్‌ గేయ రచయితకు ఎదురు దెబ్బ

జావేద్‌ అక్తర్‌  మధ్యంతర పిటిషన్‌ను తిరస్కరించిన  బాంబే హైకోర్టు

సాక్షి,ముంబై: వివాదాస్పద బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కోర్టులో ఊరట లభించింది. ప్రముఖ బాలీవుడ్‌ గీత రచయిత జావేద్ అక్తర్ కంగనాపై దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ విచారణకు బొంబాయి హైకోర్టు సోమవారం నిరాకరించింది. ఈ సందర్బంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మూడో పక్షం మధ్యంతర దరఖాస్తులను అనుమతించలేమనీ, ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు, లేదా న్యాయవాదిని అడుగుతామని  తెలిపింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యానికి  కోర్టు అనుమతిస్తే సంబంధిత పిటిషన్లు వరదలా  వచ్చి పడతాయని కోర్టు వ్యాఖ్యానించింది. కంగనాపై  క్రిమినల్‌ కేసులు ఉన్న నేపథ్యంలో ఆమె పాస్‌పోర్టు రెన్యువల్‌ నిలిపివేయాలంటూ జూలై 1న  అక్తర్ మధ్యంతర పిటిషన్‌ వేశారు. దీన్ని విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. అలాగే జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు సింగిల్‌బెంచ్‌ను ఆశ్రయించాలని కంగనాకు కోర్టు సూచించింది. 

కంగనాపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పాస్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం కేసులేవీ లేవని తప్పుడు ప్రకటన చేశారని జావేద్‌ అక్తర్‌ ఆరోపించారు. ఇందుకు కంగన తరపు కౌన్సిల్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అథారిటీకి తప్పుడు పత్రాలు అందించిందంటూ ఆయన మధ్యంతర పిటీషన్‌ దాఖలు చేశారు. కోర్టులో తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని రనౌత్ చేసిన ప్రకటన అబద్ధమని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించేదని జావేద్‌ అక్తర్ న్యాయవాది బృందా గ్రోవర్ వాదించారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి జస్టిస్ ఎస్ ఎస్ షిండే, జస్టిస్ ఎన్‌జే జమదార్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఇలాంటి పిటీషన్లను స్వీకరించలేమని జస్టిస్‌ షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తామని జావేద్ అక్తర్ న్యాయవాది భరద్వాజ్ తెలిపారు. "కంగనాకు పాస్‌పోర్టు జారీ చేయబడినప్పటికీ, అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులను వెల్లడించలేదనే అంశాన్ని పాస్‌పోర్టు కార్యాలయ దృష్టికి తీసుకెడతామని భరద్వాజ్ చెప్పారు. రెండు ఎఫ్ఐఆర్‌లలో పేరున్నప్పటికీ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసు పెండింగ్‌లో లేదని కంగనా న్యాయవాది వాదించారు. సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళవలసి ఉన్న కారణంగా తన పాస్ట్‌ పోర్టును రెన్యువల్‌ చేయాలని కోరుతూ జూన్ 28 న ప్రత్యేక డివిజన్ బెంచ్‌ముందు  కంగన పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు కాస్టింగ్ డైరెక్ట‌ర్‌, ఫిట్నెస్ ట్రైన‌ర్ మునావర్‌ అలీ సయ్యద్‌ కంగనా, ఆమె సోదరి రంగోలిపై నమోదు చేసిన దేశద్రోహం కేసును రద్దు చేయాలని కోరుతూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 11 వ తేదీకి వాయిదా వేసింది.

కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  అనుమానాస్పద మృతి అనంతరం(జూలై, 2020లో) వివిధ న్యూస్‌ ఛానళ్లలో తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా  వ్యాఖ్యానించారని  ఆరోపిస్తూ  కంగనాపై  పరువు నష్టం దావా వేశారు  జావేద్‌ అక్తర్‌. దీంతో ఫిబ్రవరి 2021లో కోర్టు కంగనాకు నోటీసులు ఇచ్చింది. కానీ కంగన కోర్టుకు  హాజరు కాలేదు.  దీంతో ఆమెకు మార్చిలో బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు