Kangana Ranaut: కన్యాదానాన్ని కన్యామాన్‌గా మార్చేసిన యాడ్‌పై కంగనా ఫైర్‌

22 Sep, 2021 20:51 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటించిన యాడ్‌ మీద ఒంటికాలిపై లేచింది కంగనా రనౌత్‌. హిందూ వివాహాల్లో ప్రధాన ఆచారమైన కన్యాదానాన్ని కన్యామాన్‌గా మార్చుదాం అని పిలుపునివ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో... 'దేశ సరిహద్దులో జవాను చనిపోతే ఆ అమరవీరుడి తండ్రి.. చింతించకండి, నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు. అతడిని దేశ రక్షణ కోసం దానం చేస్తాను, అది కన్యాదానం అయినా 'పుత్రదానం' అయినా సరే! అంటూ గొప్పగా మాట్లాడే మాటలను మనం తరచూ టీవీలో చూస్తూనే ఉన్నాం. పరిత్యాగం, దానం అనేది గొప్ప విషయం. కానీ ఎప్పుడైతే ఈ దానాన్ని సమాజం చిన్నచూపు చూస్తుందో అప్పుడు రామరాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని గుర్తించాలి. హిందువులను, హిందూ ఆచారాలను కించపరచడం ఇకనైనా ఆపండి. గ్రంథాల్లో భూదేవి, స్త్రీ ఇద్దరినీ దైవంగానే పూజిస్తారు. వారిని శక్తికి మూలంగా చూడటంలో తప్పు లేదు' అని రాసుకొచ్చింది.

కన్యాదానం అనే పదాన్ని మార్చేసిన వాణిజ్య కంపెనీ మాన్యవర్‌ మీద కూడా మండిపడింది కంగనా. 'కులమతాలను, రాజకీయాలను అడ్డుపెట్టుకుని వస్తువులను అమ్మాలన్న ప్రయత్నాలను మానుకోవాలని అన్ని బ్రాండ్లకు విజ్ఞప్తి చేస్తున్నా. అమాయకపు వినియోగదారులను మీ తెలివైన ప్రకటనలతో మానిప్యులేట్‌ చేయడం ఆపేయండి' అని హెచ్చరించింది. ఇక సదరు యాడ్‌లో అలియా భట్‌... ఫ్యామిలీ తనను ఎంతగానో ప్రేమించిందని చెప్తూనే 'నేనేమైనా వస్తువునా దానం చేయడానికి! కన్యాదానమే ఎందుకు?' అని ప్రశ్నిస్తూ ఇప్పటినుంచి దీన్ని కన్యామాన్‌(గౌరవంతో పంపించడం)గా మార్చుదాం.. అని చెప్పుకొచ్చింది. దర్శకుడు అభిషేక్‌ వర్మన్‌ డైరెక్ట్‌ చేసిన ఈ యాడ్‌ రిలీజైనప్పటి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

మరిన్ని వార్తలు