నటి రాగిణి ద్వివేది రిమాండ్‌ పొడిగింపు

8 Sep, 2020 11:25 IST|Sakshi

బెంగళూరు: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదిని మరో ఐదురోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీచేసింది. శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ వాడకంపై బెంగళూరు పోలీసులకు చెందిన సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. రాగిణితో సహా ఆరుగురిని అరెస్టు చేసిన సీసీబీ మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసింది. శుక్రవారం అరెస్టయిన రాగిణి విచారణకు సహకరించడం లేదని పోలీసువర్గాలు వెల్లడించాయి. అందుకే మరో ఐదురోజుల కస్టడీ కోరాల్సి వచ్చిందని వివరించాయి. ఆధారాలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో రాగిణి తన మొబైల్‌ ఫోన్‌లోని అన్ని మెసేజ్‌లను తొలగించింది. అయితే సీసీబీ ఈ డాటాను తిరిగి పొందింది. కాగా ఇదే కేసులో నిందితుడైన ఆదిత్య అల్వా (మాజీ మంత్రి జీవరాజ్‌ అల్వా కుమారుడు) కోసం పోలీసులు గాలిస్తున్నారు.  ఆదిత్య ముంబైలో తలదాచుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.  
 
కొనసాగుతున్న విచారణ
శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ స్కాంలో సీసీబీ అదుపులో ఉన్న నటి రాగిణి ద్వివేదిని మూడోరోజు సోమవారం కూడా విచారించారు. నిందితులు ప్రశాంత్‌ రంకా, రాహుల్, లూమ్‌ పెప్పర్, రవిశంకర్‌లను సీసీబీ పోలీసులు అదివారం అర్ధరాత్రి వరకు విచారించి ముఖ్య సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. రాగిణి, రవిశంకర్, వీరేన్‌ ఖన్నాల కస్టడీ ముగియంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బెంగళూరు ఎసీఎంఎం 1వ కోర్టు జడ్జి ముందు హాజర్‌ పరిచి మళ్లీ ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. రాగిణి అలర్జీ, వెన్నునొప్పి ఉన్నాయని చెప్పడంతో ఆమెకు మహిళా సంరక్షణ కేంద్రంలో చికిత్స చేయించారు. అనారోగ్యం పేరుతో విచారణకు సహకరించడం లేదని పోలీసులు జడ్జికి ఫిర్యాదు చేశారు. రాగిణి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఆమె ఎక్కడెక్కడకు ప్రయాణించిందో విచారిస్తున్నారు. (8 గంటలు ప్రశ్నల వర్షం)   

విందు, వినోదాలపై దృష్టి
తాజా విచారణలో రాగిణి మిత్రబృందం ఎక్కడెక్కడ పార్టీలను జరిపేవారు, ఎవరెవరు పాల్గొనేవారు తదితర అంశాలను సేకరించారు. నిందితులు– పార్టీ నిర్వాహకుల మధ్య నడిచిన ఫోన్‌ చాటింగ్‌లను సేకరించారు. కొన్ని సందేశాలు ఆఫ్రికన్‌ భాషలో ఉన్నట్లు ప్రధాన నిందితుడు లూమ్‌ పెప్పర్‌ నాటకం ఆడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రాగిని సన్నిహితుడు, ఆర్టీఓ ఉద్యోగి రవిశంకర్‌ మొబైల్‌కు వచ్చిన ఇంగ్లిష్‌ సందేశాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. వీరు నిర్వహించే విందు వినోదాల్లో పాల్గొని డ్రగ్స్‌ సేవించేవారిలో కాలేజీ విద్యార్థులు, టెక్కీలు ఉన్నట్లు గుర్తించారు. మహదేవపురకు చెందిన ఒక టెక్కీతో నిత్యం సంప్రదించినట్లు గుర్తించారు.   

కార్పొరేటర్‌ ఇంట్లో సోదాలు  
డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలపై బీబీఎంపీ కార్పొరేటర్‌ కేశవమూర్తి కొడుకు యశస్‌కు ఎన్‌సీబీ అధికారులు విచారణకు రావాలని నోటీసులు పంపినా రాలేదు. దీంతో అధికారులు కార్పొరేటర్‌ ఇంటికి ఆదివారం సాయంత్రం వెళ్లి సోదాలు చేశారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. యశస్‌ను అక్కడే విచారించినట్లు సమాచారం.   

నిష్పాక్షపాతంగా  విచారణ: హోంమంత్రి
డ్రగ్స్‌ దందా కేసును నిష్పాక్షపాతంగా విచారించాలని హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధికారులను ఆదేశించారు. అధికారులపై ఒత్తిళ్లు లేవు, ఈ కేసుతో డ్రగ్స్‌ మాఫియా లేకుండా పోవాలని సోమవారం ఆర్‌టీనగరలోని తన నివాసంలో మాట్లాడుతూ అన్నారు. ఈ కేసులో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదని చెప్పారు.    

డ్రగ్స్‌ విచారణపై ఒత్తిడి లేదు: సీపీ
బనశంకరి: సోమవారం నగరపోలీస్‌ కమిషనర్‌ (సీపీ) కమల్‌పంత్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ కేసుకు సంబందించి తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. ఈ కేసు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని, సాక్ష్యాధారాల్ని సేకరించి నిందితులను అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.  ఈ కేసులో నేరుగా అరెస్ట్‌ చేయడం సాధ్యం కాదని, ఆధారాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు