Karna Telugu Movie Review: ‘కర్ణ’ మూవీ ఎలా ఉందంటే..

24 Jun, 2023 17:33 IST|Sakshi
Rating:  

టైటిల్‌: కర్ణ
నటీనటులు:కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, అజయ్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు తదితరులు
నిర్మాణ సంస్థ: సనాతన క్రియేషన్స్
నిర్మాత: కళాధర్‌ కొక్కొండ
దర్శకత్వం: కళాధర్ కొక్కొండ  
సంగీతం: ప్రశాంత్‌ బీజే
సినిమాటోగ్రఫీ: శ్రవణ్‌ జి కుమార్‌
విడుదల తేది: జూన్‌ 23, 2023

‘కర్ణ’ కథేంటంటే..
కర్ణ(కళాధర్‌ కొక్కొండ..ముగ్గురిని హత్య చేసి జైలు జీవితం గడిపి బయటకు వస్తాడు. అనంతరం స్నేహితులను మోసం చేసిన వారిని టార్గెట్‌ చేస్తూ హత్యలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ మంత్రి కొడుకును కూడా చంపేస్తాడు. దీంతో కర్ణ కోసం పోలీసులు గాలిస్తుంటారు. మరి పోలీసులకు కర్ణ దొరికాడా? అసలు స్నేహితులను మోసం చేసినవారిని మాత్రమే కర్ణ ఎందుకు చంపుతున్నాడు? తన చిన్ననాటి స్నేహితుడు పండు(మహేందర్‌) ఏమయ్యాడు? ప్రేమించిన ఫాతిమాతో తన వివాహం జరిగిందా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
 
ఎలా ఉందంటే.. 

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది.స్నేహానికి ద్రోహం చేస్తే చంపడానికి కూడా వెనుకాడని విధంగా కర్ణ ఎలా రాటు దేలాడు? అనే విషయాన్ని చాలా కన్విన్సింగ్ గా చెప్పడంలో డైరెక్టర్ సఫలం అయ్యాడు కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం విఫలం అయ్యాడు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి బలంగా రాసుకుంటే బాగుండేది.

‘చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం ’అంటూ ట్రైలర్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించాడు. అందుకు తగ్గట్లే భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాలను తెరకెక్కించాడు. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాపై అభిప్రాయాన్ని మార్చేస్తుంది. కథగా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మీద కూడా కొంత ఫోకస్ పెట్టి..పేరున్న నటీనటులతో తెరకెక్కిస్తే ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది.

కర్ణ పాత్రకు ‘కళాధర్ కొక్కొండ’ న్యాయం చేశాడు. ఒకవైపు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపడుతూ..సినిమాలో నటించి, చక్కటి అభినయంతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్‌గా మోనా ఠాకూర్‌ తన పాత్ర పరిధిమేర ఆకట్టుకుంది. ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ, ఆస్మా సయ్యద్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

 ప్రశాంత్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. పాటలు అంతంత మాత్రమే అయినా నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. డైలాగ్స్‌ బాగున్నాయి. ఎడిటర్‌ పనితీరు బాగోలేదు. సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది.శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్టు ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు