Nimisha Sajayan: సినిమా సూపర్‌ హిట్‌.. హీరోయిన్‌ అందంగా లేదట.. డైరెక్టర్‌ రెస్పాన్స్‌ చూశారా?

20 Nov, 2023 15:46 IST|Sakshi

రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌'. నవంబర్‌ 10న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా సూపర్‌ సక్సెస్‌ కావడంతో చిత్రయూనిట్‌ సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిమిషా సజయన్‌ అంత అందంగా ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తను బాగోలేకపోయినా సరే తనను సినిమాలోకి తీసుకుని ఆమె నుంచి నటన ఎలా రాబట్టుకున్నారని ప్రశ్నించాడు.

అలా అనడం చాలా తప్పు
ఈ ప్రశ్నకు ఖంగు తిన్న దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఘాటుగానే స్పందించాడు. 'ఆమె అందంగా లేదని నువ్వెలా చెప్పగలవు? నీకెందుకలా అనిపించింది? ఒకరు అందంగా లేరని అనేయడం, అలా డిసైడ్‌ చేసేయడం.. చాలా తప్పు' అని కౌంటరిచ్చాడు. దర్శకుడి సమాధానం విని చిత్రయూనిట్‌ అంతా చప్పట్లు కొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్‌ మీట్‌లోనూ భాగమైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణన్‌ ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు.

ఏమీ మారలేదు
'నేను అక్కడే ఉన్నాను. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి వదిలేయలేదు. ఏదైనా వివాదాస్పదం అయ్యే ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రశ్నలు అడిగేశాక తనకు తాను గర్వంగా ఫీలయ్యాడు. 9 ఏళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఈ హీరోయిన్‌కు ఏం తక్కువ? అంత బాగా అభినయం చేస్తోంటే ఇలా అవమానించేలా ఎలా మాట్లాడుతారో అని కామెంట్లు చేస్తున్నారు.

నటనలో ఘనాపాటి
కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిమిషా సజయన్‌ ఈ విజయోత్సవ సభకు హాజరు కాలేదు. ఈమె ఇటీవల వచ్చిన సిద్దార్థ్‌ చిత్త(చిన్నా) మూవీలోనూ నటతో మెప్పించింది. ఈమె మలయాళ నటి. 2017లో కేరాఫ్‌ సైరా భాను సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ద గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌, నాయట్టు, తొండిముతలుమ్‌ దృక్షాక్షియుమ్‌.. తదితర హిట్‌ చిత్రాల్లో నటించింది. జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ మూవీలో రాఘవ లారెన్స్‌ భార్యగా, గిరిజన యువతి మలైయారసి పాత్రలో కనిపించింది.

చదవండి: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు..

మరిన్ని వార్తలు