లోక నాయకుడి సరసన లేడీ సూపర్‌ స్టార్‌.. మణిరత్నం భారీ ప్రాజెక్ట్‌

25 Oct, 2023 10:21 IST|Sakshi

విశ్వనటుడు కమలహాసన్‌ ఓ పక్క నటిస్తూ , మరోపక్క సొంత సంస్థలో చిత్ర నిర్మాణాలతో, ఇంకోపక్క బిగ్‌ బాస్‌ రియాల్టీ గేమ్స్‌ షోలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈయన కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో నటిస్తున్న ఇండియన్‌ – 2 చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా తదుపరి తన సొంత నిర్మాణ సంస్థ రాష్ట్ర కమిటీ నిర్మిస్తూ కథానాయకుడుగా నటిస్తున్న చిత్ర ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనికి హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా నటుడు శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా కమలహాసన్‌ నిర్మిస్తున్న ఛత్రపతి షూటింగ్‌ జరుగుతోంది, అదేవిధంగా శింబు హీరోగా మరో చిత్రాన్ని నిర్మించనున్నారు.

కాగా తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటించనున్న తన 234వ చిత్రం గురించి అప్డేట్‌ వెలువడింది. ఈ భారీ చిత్రంలో నటి త్రిష కథానాయకిగా నటించనున్నట్లు ఇంతకుముందు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇందులో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించనున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. నయనతార ఇంతకుముందు కోలీవుడ్‌లో నటుడు రజనీకాంత్‌, విజయ్‌, అజిత్‌, సూర్య, విక్రమ్‌, శివ కార్తికేయన్‌, విజయ సేతుపతి, శింబు , జయం రవి, ధనుష్‌, ఆర్య వంటి స్టార్‌ హీరోల సరసన నటించారు.

అయితే ఒక్క కమలహాసన్‌కు జంటగా మాత్రం ఇప్పటివరకు నటించలేదు. 40 ఏళ్ల వయసులో ఇప్పుడు నయనతారకు ఆ చాన్స్‌ వచ్చింది. కాగా ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఇందులో నటుడు జయం రవి, దుల్కర్‌ సల్మాన్‌ ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఈ ప్రెస్టేజియస్‌ చిత్రానికి సంబంధించిన ప్రొమోను కమలహాసన్‌ 69వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌ 7న అధికారికంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.

మరిన్ని వార్తలు