దీపావళి మనసుని హత్తుకుంటుంది

8 Nov, 2023 00:31 IST|Sakshi

 ‘స్రవంతి’ రవికిశోర్‌

‘‘ఇప్పుడు ప్రేక్షకులు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చూస్తున్నారు. మా ‘దీపావళి’ చిన్నదైనా అందమైన సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసులను హత్తుకుంటాయి’’ అని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌ అన్నారు. పూ రాము, కాళీ వెంకట్‌ ప్రధాన పాత్రల్లో ఆర్‌ఏ వెంకట్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కీడా’ (తెలుగులో ‘దీపావళి’). కృష్ణ చైతన్య సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా 38 ఏళ్ల జర్నీలో దాదాపుగా నేను చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయి. నేను డబ్బుల గురించి ఆలోచించను. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్‌ అవుతుందా? లేదా అని మాత్రమే ఆలోచిస్తా. కథ పూర్తయ్యాకే సినిమాని సెట్స్‌ మీదకు తీసుకెళతాను. ఓ సినిమా పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే.

‘దీపావళి’ కథనిప్రాణం పెట్టి రాశాడు వెంకట్‌. చెప్పిన కథను చెప్పినట్లు స్క్రీన్‌ మీదకు తీసుకొచ్చాడు. మా సినిమా ఇండియన్‌ పనోరమాకి ఎంపికవడం గొప్ప అనుభూతి. చెన్నై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించడం సంతోషంగా ఉంది. ఇక రామ్‌ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అలాగే రామ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది. ఇందుకు సరైన కథ కుదరాలి’’ అన్నారు.   

మరిన్ని వార్తలు