సింగిల్‌ షాట్‌లో తెరకెక్కిన ‘డ్రామా’

16 Sep, 2022 21:47 IST|Sakshi

ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే అనుభవం, ప్రతిభ ఉండాలి. అలాంటి చిత్రాలు చేసి నటుడు పార్తీపన్‌ గిన్నిస్‌ రికార్డ్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇటీవల రూపొందించిన ఇరవిన్‌ నిళల్‌ చిత్రం తరహాలో తాజాగా సింగిల్‌ షాట్‌ రూపొందించిన చిత్రం డ్రామా. వైబ్‌ 3 ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంటోని దాస్‌ నిర్మించిన ఈ చిత్రంలో జైబాల, కావ్య బెల్లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. కిషోర్‌ ప్రధాన పాత్రలో నటించారు. శినోస్‌ ఛాయాగ్రహణం, బిజిటల్, జయం కే.దాస్, జెసిన్‌ జార్జ్‌ త్రయం సంగీతాన్ని అందించారు.

నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దీని విడుదల హక్కులను శశికళ ప్రొడక్షన్స్‌ సంస్థ పొందింది. నిర్మాత తెలుపు తూ ఇది ఒక హత్య నేపథ్యంలో సాగే క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో 12 మంది అధికారులు ఉండగా కరెంట్‌ పోయిన రెండు నిమిషాలు సమయంలో ఒక హత్య జరుగుతుందనీ, దాన్ని ఎవరు? ఎందుకు చేశారన్నది చిత్ర ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు.

ఓ పోలీస్‌ స్టేషన్లో ఒక రాత్రి జరిగే కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ఓకే షాట్లో రెండున్నర గంటల్లో తెరకెక్కించిన ఈ చిత్రం కోసం 180 రోజులు రిహార్సల్స్‌ చేసినట్లు చెప్పారు. ఇందులో రెండు పాటలు, ఒక మేకింగ్‌ వీడియో పాట ఉంటాయని చెప్పారు. ఈ చిత్రాన్ని పార్తీపన్‌ ఇరవిన్‌ నిళల్‌ చిత్రం కంటే ముందే రూపొందించామనీ కరోనా తదితరులు కారణాల వల్ల ఆలస్యం అయ్యింది అని తెలిపారు.

మరిన్ని వార్తలు