Krishnam Raju: తీవ్ర విషాదంలో ప్రభాస్‌.. పెదనాన్నను చివరిసారిగా అలా

11 Sep, 2022 09:04 IST|Sakshi

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రెబల్‌స్టార్‌గా ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణంరాజు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు హాస్పిటల్‌కు చేరుకుంటున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం అటు టాలీవుడ్‌తో పాటు హీరో ప్రభాస్‌కి కూడా తీరని లోటని చెప్పాలి. నిన్న(శనివారం)తన పెదనాన్నను చూసేందుకు ప్రభాస్‌  ఏఐజీ హాస్పిటల్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన విజువల్స్‌ సోషల్‌ మీడియాలోనూ చక్కర్లు కొట్టాయి. 

గతంలోనూ అనారోగ్య సమ​స్యలతో కృష్ణంరాజు ఆసుపత్రిలో​ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి కూడా రెండు మూడు రోజుల అనంతరం ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నారంతా. కానీ అంతలోనే కృష్ణంరాజు ఇకలేరనే వార్త టాలీవుడ్‌కి షాక్‌ గురిచేసిందనే చెప్పాలి. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్‌కు ఎంతో అనుబంధం ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న ప్రభాస్‌ సినీ కెరీర్‌లో  కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది.  నటుడిగా ప్రభాస్‌ ఇంత ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో సంతోషమని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెబుతుండేవారు.

మరిన్ని వార్తలు