Super Star Krishna: ప్రాణ స్నేహితులు, ఇండస్ట్రీకి కలిసే వచ్చారు, కలిసే వెళ్లిపోయారు

15 Nov, 2022 21:01 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంతో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒకప్పటి తరం హీరోలందరూ కన్నుమూశారంటూ తెలుగు ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌ బాబు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. ఇలా సీనియర్‌ హీరోలందరూ మన మధ్య లేకపోవడంతో ఒక తరం శకం ముగిసిందంటూ సోషల్‌​ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా నేడు ఉదయం తెల్లవారుజామున కృష్ణ మరణించారు. ఇండస్ట్రీకి చెందిన పలువురూ ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణం రాజు భార్య శ్యామ దేవి కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం కన్నీటి పర్యంతమయ్యారు.  'కృష్టం రాజుకి కృష్ణ అంటే ఎంతో అనుబంధం. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. వెళ్లిపోయేటప్పుడు కూడా కలిసే వెళ్లిపోదాం అనుకున్నారేమో! అందుకే మనందరికీ ఇంత బాధను మిగిల్చి ఇద్దరూ ఒకేసారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

మహేశ్‌బాబు వరుసగా అన్న, తల్లి, తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం. సుల్తాన్‌ సినిమా దగ్గరి నుంచి కృష్ణగారి కుటుంబంతో నాకూ మంచి అనుబంధమేర్పడింది. షూటింగ్‌లో భాగంగా అండమాన్‌లో నెల రోజులపాటు ఉన్నప్పుడు విజయ నిర్మల గారు వంట చేసి పెట్టేవారు. మొన్న కృష్ణ బర్త్‌డేకి కూడా కృష్ణం రాజు గారు ఫోన్‌ చేసి ఇంటికి రా, చేపల పులుసు చేసి పెడతానన్నారు. అలాంటిది.. ఈరోజు వాళ్లిద్దరూ లేరంటే తట్టుకోలేకపోతున్నాం. భూమి, ఆకాశం ఉన్నంతవరకు వారు చిరస్మరణీయులుగా మిగిలిపోతారు' అని చెప్తూ ఏడ్చేసింది శ్యామలా దేవి. కాగా రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు సెప్టెంబర్‌ 11న తనువు చాలించారు.

చదవండి: కృష్ణ పార్థివదేహం వద్ద బోరున ఏడ్చేసిన మోహన్‌బాబు
అదే సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆఖరి చిత్రం..

మరిన్ని వార్తలు