మరో విషాదం: ప్రముఖ రంగ స్థల నటుడు, దర్శకుడు కన్నుమూత

15 Nov, 2021 08:48 IST|Sakshi
ఇందుపల్లి రాజ్‌కుమార్‌ (ఫైల్‌) 

సాక్షి, చిలకలూరిపేట(గుంటురు): ప్రముఖ రంగ స్థల నటుడు, దర్శకుడు ఇందుపల్లి రాజ్‌కుమార్‌(67) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. 1954 జూన్‌ 16న జన్మించారు. తండ్రి రాజారత్నం అందించిన ప్రోత్సాహంతో విద్యార్థి దశలోనే నటుడుగా రంగ స్థలం ప్రవేశం చేశారు. హైస్కూల్‌ విద్యార్థిగా ‘నాటకం రేపనగా’ అనే నాటిక ద్వారా రంగప్రవేశం చేసిన ఆయన చీకటి తెరలు నాటికలో గుడ్డివాడి పాత్ర ధరించి చిన్న వయసులోనే విమర్శకుల ప్రశంసలు పొందారు.

సీనియర్‌ దర్శకుడు ఎస్‌ఎం బాషా, రషీద్‌ ప్రోత్సాహంతో నటుడిగా కొనసాగారు. ప్రజా నాట్యమండలి కళాకారులు సీఆర్‌ మోహన్‌ తదితరులతో చైర్మన్‌ వంటి నాటకాల్లో నటించారు. వై.శంకరరావు దర్శకత్వం వహించిన జరుగుతున్న చరిత్ర నాటికను ప్రదర్శించి సినీనటులు రాజనాల, కాంతారావు ప్రశంసలు పొందారు. చరిత్ర హీనులు, నీరు పోయ్, చివరకు మిగిలేది, వందనోటు, మనుషులొస్తున్నారు జాగ్రత్త, సర్పయాగం వంటి నాటికలలో నటించి పలు బహుమతులు పొందారు.

1985లో ఎం.దివాకర్‌బాబు రచించిన కుందేటికొమ్ము నాటిక నటుడిగా, దర్శకునిగా రాజ్‌కుమార్‌ కీర్తి ప్రతిష్టలను తెలుగు నాటకరంగానికి చాటిచెప్పింది. ఈ నాటికలో రాజ్‌కుమార్‌ ధరించిన పాత్రకు 55 పరిషత్‌ల్లో ఉత్తమ నటుడు, క్యారెక్టర్‌ నటుడు బహుమతులతో పాటు 30 చోట్ల ఉత్తమ దర్శకుడిగా అవార్డులు పొందారు. కె.న్యూటన్‌ రచించిన దండమయా విశ్వంభర నాటికకు దర్శకత్వం వహించటంతో పాటు అందులో బాణం పాత్రను పోషించి పలు బహుమతులు సాధించారు.

1987లో సాగరి సంస్థను ప్రారంభించి మృగమైదానం, హళ్లికి హళ్లి, సాలభంజిక, మరణమంజీరం వంటి నాటికలు పలు పరిషత్తుల్లో ప్రదర్శించి బహుమతులు పొందారు. సంప్రదాయ శైలికి భిన్నంగా ప్రదర్శించిన ఖడ్గసృష్టి నాటిక రాజ్‌కుమార్‌ దర్శక ప్రతిభకు అద్దం పట్టడంతో పాటు ఎన్నో బహుమతులు సాధించి పెట్టింది. ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకునిగా 500 పైగా బహుమతులు సాధించటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం లభించింది.

ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు రంగ స్థల ప్రముఖులు, రాజకీయ నాయకులు పట్టణంలో శారదా జెడ్పీ హైస్కూ ల్‌ సమీపంలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు