ఏఆర్‌ రెహ్మాన్‌కు ఊరట.. పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

25 Jul, 2021 18:58 IST|Sakshi

చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్‌ రెహ్మాన్‌ 2000 సంవత్సరంలో ఒక సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాళియప్పన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. తాను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదని, ఏఆర్‌ రెహ్మాన్‌ మాత్రం లబ్ధి పొందారని..తనకు నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని కాళియప్పన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ కేసును న్యాయమూర్తి ఆర్‌.సుబ్రమణియం శుక్రవారం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకు ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి పిటిషన్‌దారుడు తరఫు న్యాయవాది వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు.

మరిన్ని వార్తలు