Naagali Short film: ప్రతి రైతు మనుసును కదిలిస్తున్న 'నాగలి' చిత్రం.. యూట్యూబ్‌లో విడుదల

5 Sep, 2023 09:19 IST|Sakshi

నిజ జీవిత విలువల నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రైతు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనం పలుకుతుంటారు. రైతన్న కష్టసుఖాలను తెరపై ఆవిష్కరించే సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇదే బాటలో ఇప్పుడు 'నాగలి' అనే ఒక లఘు చిత్రాన్ని డాక్టర్‌ విశ్వామిత్ర రెడ్డి, మానస (USA) సమర్పణలో సుంకర.నీలిమా- దేవేందర్‌ రెడ్డి నిర్మించారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన 'నాగలి' అనే 24 నిమిషాల లఘు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇందులో బలగం ఫేమ్‌ అరుసం మధుసుదన్‌ కీలక పాత్రలో నటించారు.

(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా ధరఖాస్తు చేసుకోండి: విజయ్‌)

నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేస్తున్న నివేదికల ప్రకారం ప్రతి ఏడాది భారత్‌లో సుమారు 15 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టు కూడూ పలు మార్లు వ్యాఖ్యానించింది.  రైతుల ఆత్మహత్యలపై ప్రతీ రోజూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తుంటాయి.. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరిదీ కూడా రైతు నేపథ్యం కాబట్టి.

అలాంటి రైతుల ఘోషను గుర్తించిన సుంకర.నీలిమా- దేవేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమ వంతుగా ఇలాగైనా  రైతుల ఆత్మహత్యలు ఆగాలనే ఆకాంక్షతో 24 నిమిషాల నిడివితో 'నాగలి' అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మొదట తన ప్రేమను ప్రియురాలు కాదని చెప్పడంతో ఒక యువకుడు పొలం గట్టుపైనే పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తాడు. ఈలోపు నటుడు మధు అక్కడ ప్రత్యక్షం అయి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు.. ఈ సీన్‌ రెగ్యూలర్‌ సినిమాల్లో మాదిరి కాకుండా కొంచెం ప్రత్యేకంగా క్రియేట్‌ చేశారు.  

నీతో పాటు పురుగుల మందు తాగి చనిపోయేందుకు ఒక పెద్దాయన కూడా ఇక్కడికి వస్తున్నాడని ఆ యువకుడితో చెప్తాడు. అది నీకు ఎలా తెలుసని ఆ యువకుడు ప్రశ్నిస్తాడు. ఈలోపు ఆ పెద్దాయన నిజంగానే వస్తాడు. వారిద్దరూ చనిపోబోతున్నట్లు ముందే అతను ఎలా గ్రహించాడు...?  ఒకరైతు ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు..? ఆ యువకుడిని కాదన్న యువతి ఎవరు..?  వారితో పాటు ఉన్న తీరని కష్టాలు ఏంటి..? తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్రతి గ్రామంలో ఉండే యువకుల్లో కొందరైనా ఇలా ఆలోచిస్తే తమ చుట్టూ ఉన్న రైతులను కాపాడుకోవచ్చని దర్శకుడు జానా రాజ్‌కుమార్ చెప్పిన విధానం మెప్పిస్తుంది. ఎంతో ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని మీరూ చూసేయండి.

మరిన్ని వార్తలు