Natyam Movie: అరుదైన ఘనతను సొంతం చేసుకున్న 'నాట్యం' మూవీ

7 Nov, 2021 09:26 IST|Sakshi

‘‘డ్యాన్స్, వ్యాపార  రంగం నుంచి వచ్చిన మీరు ‘నాట్యం’ లాంటి సినిమాను ఎందుకు చేస్తున్నారు? అని చాలామంది అడిగారు. ‘ఇఫీ’ వేడుకల్లో మా ‘నాట్యం’ సినిమా ప్రదర్శితం కానుండటమే ఆ ప్రశ్నకు సమాధానం. మా చిత్రానికి ఆ అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది’’ అని సంధ్యారాజు అన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’.

రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 22న విడుదలైంది. కాగా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు(ఇఫి) ఈ నెల 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ 52వ ‘ఇఫి’ వేడుకల్లో  ఇండియన్‌ పనోరమ విభాగంలో ‘నాట్యం’ ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ కోరుకొండ మాట్లాడుతూ– ‘‘నాట్యం’ సినిమాతో భారతీయ, తెలుగు సంస్కృతులు, సంప్రదాయల గురించి మాట్లాడుకుంటే చాలనుకున్నాం.. కానీ ఇప్పుడు మా చిత్రం ప్రేక్షకులు గర్వపడే తెలుగు సినిమాగా నిలిచింది.

మా చిత్రాన్ని కె.విశ్వనాథ్, చిరంజీవి, బాలకృష్ణ, రామ్‌చరణ్, రవితేజ.. వంటి చాలామంది ప్రోత్సహించారు.. ఇందుకు వారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నాట్యం’ సినిమా గురించి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు’’ అన్నారు నటుడు కమల్‌ కామరాజు. నిర్మాతలు ప్రసన్న కుమార్, వి.మోహన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు