సుశాంత్‌ డ్రగ్స్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌

2 Sep, 2020 14:20 IST|Sakshi

ముంబై: సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్  డ్రగ్‌ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం అరెస్ట్‌ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ  తెలిపింది. ఈ సందర్భంగా ఎన్‌సీబీ అధికారులు మాట్లాడుతూ, ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని  తెలిపారు. 

శామ్యూల్‌ మిరాండా సుశాంత్‌ సింగ్‌ ఇంటిలో హౌస్‌ కీపింగ్‌ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్‌ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్‌ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్‌ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్‌ విలాత్రాను కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని  ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్‌ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో  జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇక సుశాంత్‌ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే.  సుశాంత్‌ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్‌ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్‌ ఇచ్చారు’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు