Rajinikanth: కండక్టర్‌గా పని చేసిన రజనీకాంత్‌.. ఓరోజు ఆ శబ్ధాలు వినిపించడంతో..

6 Nov, 2023 12:53 IST|Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను చూడగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తారని, అత్యంత గౌరవం ఇస్తారని, అయితే ఆయన ఆ స్థాయికి రావడానికి కారణం నిరంతర శ్రమ, కృషి, పట్టుదలే కారణమని విశ్రాంత న్యాయమూర్తి ఎస్కే కృష్ణన్‌ పేర్కొన్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని శ్రమిస్తే మీరు ఆ స్థాయికి చేరుకోవడం సాధ్యమేనన్నారు. శనివారం చైన్నెలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో ముందుగా యునైటెడ్‌ ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వాహకుడు నైల్లెసుందరాజన్‌ మాట్లాడుతూ.. ఓ సాధారణ బస్సు కండక్టర్‌గా పని చేసిన రజినీకాంత్‌ ఒక రోజు తన విధులు ముగించుకుని ఇంటికి రాగా ఆ సమయంలో సంగీత ధ్వనులు వినిపించానన్నారు. అవి నాటక రిహార్సల్స్‌ శబ్దాలు కావడంతో అప్పుడే రజనీకాంత్‌కు తాను నటుడు కావాలనే కోరికకు బీజం పడిందన్నారు. తర్వాత సోదరుడు సత్యనారాయణన్‌ ప్రోత్సాహంతో మద్రాసు వైపు అడుగులు వేశారన్నారు.


రిటైర్డ్‌ న్యాయమూర్తి కృష్ణన్‌కు సత్కారం

ఇక్కడ విఠల్‌ అనే స్నేహితుడితో కలిసి ఉంటూ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ శిక్షణ పొందిన తరువాత అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశారని, అలా దర్శకుడు కె.బాలచందర్‌ దృష్టిలో పడి నటుడిగా రంగప్రవేశం చేశారన్నారు. చాలా ఏళ్ల పోరాటం అనంతరం సూపర్‌ స్టార్‌ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. కాగా మహా ఆర్ట్స్‌ నిర్వాహకురాలు డా.అనురాధ జయరామ్‌, యూనైటెడ్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ నిర్వాహకులు కళైమామణి, డా.నైల్లెసుందరాజన్‌.. వెండితెర, బుల్లితెర నటీనటులకు ప్రోత్సాహక అవార్డుల కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు.

స్థానిక వడపళని, కుమరన్‌ కాలనీలోని శిఖరం హాల్‌లో జరిగిన ఈ వేడుకలో విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌కే కృష్ణన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో నటుడు జనని బాలు, నటి జీవిత, వరూనిక, అంగేలినాలకు ప్రత్యేక అవార్డులను అందుకున్నారు. కాగా ఈ రంగంలో చాలా ఏళ్లుగా కళాసేవ చేస్తున్న మహా ఆర్ట్స్‌ సంస్థ నిర్వాహకురాలు డా. అనురాధ జయరాంను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. అదేవిధంగా విశ్రాంతి న్యాయమూర్తి ఎస్కే కృష్ణన్‌ను నిర్వాహకులు ఈ వేదికపై ఘనంగా సత్కరించారు.

చదవండి: థియేటర్‌లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ సినిమాలు.. ఏకంగా 28 చిత్రాలు..

మరిన్ని వార్తలు