హీరోయిన్‌గా... సావిత్రి ఆఖరి చిత్రం

4 Feb, 2021 00:22 IST|Sakshi

‘ఆడపిల్లకు చదువెందుకు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా?’ ఇది పాత తరంలో తరచూ వినిపించిన మాట. కానీ, స్త్రీని చదివిస్తే, ఆ చదువు ఆమెకే కాదు... మొత్తం ఇంటికే వెలుగవుతుంది. విద్యావంతురాలైన స్త్రీమూర్తి సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆ సంగతిని 50 ఏళ్ళ క్రితమే తెరపై చెప్పిన చిత్రం ‘నిండు దంపతులు’. నేటి సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్‌ నిర్దేశకత్వంలో ఎన్టీఆర్, సావిత్రితో, బెజవాడ లక్ష్మీటాకీస్‌ ఓనర్లలో ఒక రైన మిద్దె జగన్నాథరావు యస్వీయస్‌ ఫిలిమ్స్‌పై తీసిన కుటుంబ కథాచిత్రమిది. వాణిజ్య జయాప జయాల కన్నా తెరపై చర్చించిన కీలక సామాజిక అంశం రీత్యా, సావిత్రి హీరోయిన్‌గా నటించిన ఆఖరి చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది. యాభై ఏళ్ళ క్రితం 1971 ఫిబ్రవరి 4న ఆ ఘట్టానికి తెర తీసిన ‘నిండు...’ జ్ఞాపకాలివి.

కొన్ని కథలు, కాంబినేషన్లు విశేషం. ఆడవాళ్ళకు చదువెందుకనుకొనే రోజుల్లో స్త్రీ విద్య చుట్టూ తిరిగే ఓ కథను తెరపై చెప్పగలమా? మాస్‌ హీరో ఎన్టీఆర్, సంసారపక్షమైన సినిమాల దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్‌ – ఈ ఇద్దరి కాంబినేషన్‌ ఊహించగలమా? కానీ, వారిద్దరి కలయికలో ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. అందులో ‘నిండు దంపతులు’ ఆడవారి చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని వెండితెరపై చెప్పింది.

అప్పట్లోనే... ఆడవారి చదువు కథగా...
కిళ్ళీకొట్టు నడుపుతున్నా, స్త్రీకి చదువు కావాలనుకొనే సంస్కారం ఉన్న హీరో (ఎన్టీఆర్‌)... ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఆడది ఆ ఇంటి పరువు కాపాడే కోడలనే లాయర్‌ హీరోయిన్‌ (సావిత్రి)... స్త్రీకి ఆర్థికస్వేచ్ఛ ఉండాలంటూ బి.ఏ చదువుకే గొప్పలు పోయే హీరో మేనకోడలు (లక్ష్మి)... కాపురం చేయాల్సిన ఆడదానికి చదువెం దుకనుకొనే హీరోయిన్‌ చెల్లె లైన టీ కొట్టు సుబ్బులు (విజయనిర్మల) – ఈ 4 పాత్రల మధ్య కథ ‘నిండు దంపతులు’. హీరో, ఏ దిక్కూ లేని మేనత్త కూతురు వాణి (లక్ష్మి)ని బి.ఏ దాకా చదివిస్తాడు. ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు. కానీ ఆమె ఓ పెద్దింటి అబ్బాయిని (చంద్రమోహన్‌)ని పెళ్ళి చేసుకుంటుంది. లా చదివిన హీరోయిన్, చదువు లేని హీరోను పెళ్ళాడాల్సి వస్తుంది. వాణి చిక్కుల్లో పడినప్పుడు హీరోయిన్‌ సావిత్రి నల్లకోటు వేసుకొని, కోర్టులో వాదించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతుంది.

నాయికగా సావిత్రి ఆఖరి సినిమా!
‘మహానటి’ చిత్రం ద్వారా ఈ తరానికీ సుపరిచితమైన శిఖరాగ్ర స్థాయి సినీ నాయిక సావిత్రి. ఆమె తన కెరీర్‌లో కథానాయికగా చేసిన చివరి చిత్రంగానూ ‘నిండు దంపతులు’ గుర్తుంటుంది. ఆ సినిమా తర్వాత మరణించే వరకు ఆ మహానటి చేసిన పాత్రలన్నీ తల్లి, వదిన లాంటి సహాయ పాత్రలే! 1966లో షూటింగ్‌ మొదలైన ఏయన్నార్‌ ‘ప్రాణమిత్రులు’లో ఏయన్నార్‌ సరసన సావిత్రి హీరోయిన్‌. తర్వాత మళ్ళీ ఏయన్నార్‌ సరసన నాయిక పాత్ర పోషించే అవకాశం సావిత్రికి రాలేదు. అయితే, ఆ తర్వాత ‘నిండు దంపతులు’ దాకా అయిదేళ్ళ పాటు ఎన్టీఆర్‌ పక్క ఆమె నాయికగా చేశారు. ఎన్టీఆర్‌ ‘పల్లెటూరు’ (1952)తో హీరోయిన్‌గా మొదలైన సావిత్రి, కథానాయికగా ఆఖరి చిత్రంలో కూడా ఆయన సరసనే నటించడం యాదృచ్ఛికం. అలా 1952 నుంచి 1971దాకా 20 క్యాలెండర్‌ ఇయర్స్‌ పాటు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్‌ తెరపై వెలిగింది.

కాంగ్రెస్‌ కార్యక్రమాల... బెజవాడ లక్ష్మీటాకీస్‌
బెజవాడలోని పేరున్న పాతకాలపు థియేటర్లలో ‘శ్రీలక్ష్మీటాకీస్‌’ ఒకటి. తెలుగు సినీ రాజధాని బెజ వాడలో మారుతీ,దుర్గాకళామందిరం తర్వాత వచ్చిన 3వ సినిమా హాలు ఇది. 1939లో మొదలైన ఆ హాలు గౌడ కులస్థులైన మిద్దె రామకృష్ణారావు, జగన్నాథరావు సోదరులది. అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్‌ వాదులు. ఆ రోజుల్లో కాంగ్రెస్‌ కార్యక్రమాలు ఈ సినిమా హాలులో జరిగేవి. రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువున్న రామకృష్ణారావు స్వాతంత్య్రం వచ్చాకా కాంగ్రెస్‌లో తిరిగారు. (నిర్మాత జగన్నాథరావు, 1977 చివర్లో రామకృష్ణారావు పోయాక, ఆ హాలు 1992లో చేతులు మారింది. ఇప్పటి స్వర్ణ ప్యాలెస్‌గా 1995లో ముత్తవరపు వెంకటేశ్వరరావు చేత రూపుమార్చుకుంది. రామకృష్ణారావు 3వ కుమారుడు మురళీకృష్ణ మాత్రం 1996 నుంచి కృష్ణాజిల్లా చీమలపాడులో ‘శ్రీలక్ష్మీ టాకీస్‌’ పేరుతో ఓ థియేటర్‌ నడుపుతున్నారు. అదే బెజవాడ పాత లక్ష్మీటాకీస్‌కు మిగిలిన కొత్త తీపిగుర్తు).

దర్శకుడే దైవమన్న ఎన్టీఆర్‌!
‘నిండు దంపతులు’ సమయానికి హీరోయిన్‌గా సావిత్రి కెరీర్‌ చివరి దశలో ఉన్న రోజులు. అప్పటికే జమున, కాంచన, వాణిశ్రీ లాంటి వారున్నా, నిర్మాత జగన్నాథరావు తమ సొంత ఊరు బెజవాడ తార అనే అభిమానంతో అభినేత్రి సావిత్రినే నాయిక లాయర్‌ పాత్రకు తీసుకుందామన్నారు. వైవాహిక జీవితంలోని చీకాకులతో అప్పటికే ఆమె సతమతమవుతున్నారు. ఆమె వ్యక్తిగత అలవాట్లు వృత్తి జీవితపు క్రమశిక్షణపై ప్రభావం చూపడం మొదలుపెట్టిన సమయమది. ‘‘ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులే అలవోకగా చెప్పిన మహానటి సావిత్రికి దురదృష్టవశాత్తూ షూటింగులో డైలాగులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ‘పెద్ద డైరెక్టర్‌ చెబుతున్నారమ్మా... వినాలి’ అంటూ సావిత్రికి ఎన్టీఆర్‌ మెత్తగా చెప్పాల్సి వచ్చింది. సినిమా రూపకల్పనలో కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అయిన డైరెక్టర్లకు స్టార్లు ఇవ్వాల్సిన సహకారం గురించి సావిత్రికి ఆయన చెప్పడం నాకిప్పటికీ గుర్తు’’ అని విశ్వనాథ్‌ అన్నారు.

సినీ నిర్మాణంలో తండ్రికి వారసులుగా...
బ్లాక్‌ అండ్‌ వైట్‌ ‘నిండు దంపతులు’ అప్పట్లో 35 ప్రింట్లతో విడుదలైంది. పాజిటివ్‌ రివ్యూలొచ్చినా, అప్పుడప్పుడే తెలుగులో మొదలవుతున్న కలర్‌సిన్మాల హవాలో కమర్షియల్‌గా ఈ సినిమా వెనుకబడింది. 50 రోజులే ఆడింది. రెండేళ్ళకే జగన్నాథరావు కన్ను మూశారు. ఆపైన ఆయన నలుగురు కుమారులు (చంద్రకుమార్, విజయకుమార్, జీవన్‌ కుమార్, వెంకట రమణ కుమార్‌) తండ్రి బాటలో సాగారు. దాసరితో ‘జీవితమే ఒక నాటకం’ (’77), విజయ నిర్మల డైరెక్షన్‌లో హీరో కృష్ణతో ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’, ‘శంఖుతీర్థం’ (’79), సోదర సంస్థ పి.వి.ఎస్‌. (పద్మావతీ వెంకటేశ్వర స్వామి) ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై కొమ్మినేని శేషగిరిరావుతో ‘కొంటె కోడళ్ళు’ (’83), రేలంగి నరసింహారావు సారథ్యంలో ‘కొంటె కాపురం’ (’86), ‘కాబోయే అల్లుడు’ (’87) తీశారు. మలయాళంలో, కన్నడంలో రెండేసి సినిమాలూ నిర్మించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల రీత్యా యస్‌.వి.యస్‌ సంస్థ చిత్ర నిర్మాణం నుంచి విరమించుకుంది. అయితే ఇప్పటికీ సినీ ప్రియులకు ఆ సంస్థ, అది తీసిన సినిమాలు చెదరని జ్ఞాపకాలే!

నాలుగు సినిమాల... ఆ కాంబినేషన్‌

దర్శకుడు కె. విశ్వనాథ్, ఎన్టీఆర్‌
ఎన్టీఆర్, కె. విశ్వనాథ్‌ల కాంబినేషన్‌ ఓ విచిత్రం. ‘అన్నపూర్ణా’ సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తితో కలసి పనిచేసిన విశ్వనాథ్‌ నిజానికి అక్కినేనికి సన్నిహితులు. దర్శకుడిగా విశ్వనాథ్‌ తొలి చిత్రం కూడా ఏయన్నార్‌ హీరోగా అన్నపూర్ణా వారు తీసిన ‘ఆత్మగౌరవం’ (1966). తర్వాత దాదాపు పాతికేళ్ళకు ఆయన మళ్ళీ ఏయన్నార్‌తో చేసింది ‘సూత్రధారులు’ (1989). కారణాలు ఏమైనా, ఆ రెండే తప్ప ఏయన్నార్‌తో విశ్వనాథ్‌ మరే సినిమా చేయలేదు.

కానీ, ఏయన్నార్‌కు ప్రత్యర్థి అయిన మరో టాప్‌ హీరో ఎన్టీఆర్‌తో కె. విశ్వనాథ్‌ ఏకంగా 4 సినిమాలు చేయడం విచిత్రం. గమ్మత్తేమిటంటే, ఆ కాంబినేషన్‌ను కుదిర్చినదీ, మొత్తం నాలుగింటిలో మూడు సినిమాలను నిర్మించిందీ ఒక్కరే – యస్‌.వి.యస్‌. ఫిలిమ్స్‌ అధినేత మిద్దె జగన్నాథ రావు. ‘‘గుంటూరులో ఒకే కాలేజీలో చదివే రోజుల నుంచి ఎన్టీఆర్‌ గారితో నాకు పరిచయం ఉంది. నా సౌండ్‌ రికార్డిస్ట్‌ రోజుల నుంచి స్నేహం ఉంది. దర్శ కుడిగా నన్ను ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకెళ్ళింది బెజ వాడ లక్ష్మీ టాకీస్‌ ఓనర్లయిన యస్‌.వి.యస్‌. ఫిలిమ్స్‌ వారే’’ అన్నారు విశ్వనాథ్‌.

అప్పటి నుంచి ఆ సంస్థలో, విశ్వ నాథ్, ఎన్టీఆర్ల కాంబినేషన్‌లో ‘కలిసొచ్చిన అదృష్టం’ (1968 ఆగస్టు 10), ‘నిండు హృదయాలు’ (1969 ఆగస్టు 15), ‘నిండు దంపతులు’ (1971 ఫిబ్రవరి 4) వచ్చాయి. నిర్మాత– యస్‌.వి.యస్‌. ఫిలిమ్స్‌ అధినేత మిద్దె జగన్నాథ రావు (1919 – 1973) శత జయంతి కూడా ఆ మధ్యనే జరిగింది. ఇవాళ్టికీ ఆయన పేరు చెప్పగానే ఆ రోజుల్లోని వారందరికీ బెజ వాడ ‘శ్రీలక్ష్మీ టాకీస్‌’ ఓనర్లలో ఒకరిగానే సుపరిచితులు.

ఆ సినిమాలన్నీ... ఆయనతోనే!

ఎన్టీఆర్‌తో నిర్మాత మిద్దె జగన్నాథరావు

స్వాతంత్య్రం వచ్చాక... సినీప్రదర్శన నుంచి సినీ నిర్మాణం వైపు కూడా మిద్దె సోదరులు విస్తరించారు. హీరో ఎన్టీఆర్‌ది బెజవాడ దగ్గరి నిమ్మకూరు కావడంతో, ఆ పరిచయం, అనుబంధంతో నిర్మాతలుగా మారారు. తొలిప్రయత్నంగా జలరుహా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆ అన్నదమ్ములు కలసి తీసిన చిత్రం ‘రాజనందిని’ (1958). మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలో, వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఆ జానపద చిత్రంలో హీరో ఎన్టీఆరే. ఆ తరువాత దాదాపు పదేళ్ళకు తమ్ముడు మిద్దె జగన్నాథరావు సొంతంగా యస్‌.వి.యస్‌. ఫిలిమ్స్‌ స్థాపించి, ఆ బ్యానర్‌ లో విడిగా సినిమాలు నిర్మించారు.

జగన్నాథరావు తమ ఆరాధ్యదైవం పేరు మీద ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఫిలిమ్స్‌ అంటూ సంస్థను పెట్టాలనుకున్నారు. ఎన్టీఆర్‌ తన ఆఫీసులో కాగితాల ప్యాడ్‌ మీద గుండ్రటి చేతిరాతతో, అందంగా ఆ బ్యానర్‌ పేరును తెలుగులో రాసిచ్చారు. అలా ‘యస్‌.వి.యస్‌’ ఫిలిమ్స్‌ ఎన్టీఆర్‌ చేతుల్లో ప్రాణం పోసుకుంది. విశేషం ఏమిటంటే, నిర్మాత జగన్నాథరావు 54వ ఏట ఆకస్మికంగా మరణించే వరకు ఆ బ్యానర్‌ లో కేవలం ఎన్టీఆర్‌ హీరోగానే సినిమాలు తీశారు. అలా ఆ బ్యానర్‌లో 5 సినిమాలు (ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వంలోని ‘నిండు మనసులు’, విశ్వనాథ్‌ తీసిన మూడు సినిమాలు, డి.యోగానంద్‌ దర్శకత్వంలోని ‘డబ్బుకు లోకం దాసోహం’) వచ్చాయి.

‘డబ్బుకు లోకం దాసోహం’ రిలీజు టైములో లావాదేవీలు చూసుకోవడానికి కీలకమైన హైదరాబాద్‌ కేంద్రానికి వచ్చారు నిర్మాత జగన్నాథరావు. ఎప్పుడూ అలవాటైన లక్డీకాపూల్‌ ద్వారకా హోటల్‌ రూమ్‌ నెంబర్‌ 101లోనే బస చేశారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్ళినా లాభం లేక, 1973 జనవరి 22న కన్నుమూశారు. అలా యస్‌.వి.యస్‌. ఫిలిమ్స్‌ – ఎన్టీఆర్‌ల కాంబినే షన్‌కు ఊహించని బ్రేక్‌ పడింది.

చిరంజీవి సినిమాకు మూలం!
చదువుకూ సంస్కారానికీ సంబంధం లేదనీ, సంస్కారానికి చదువు తోడైతే శోభిస్తుందనీ, స్త్రీకి చదువొస్తే సంసారం నిండుగా ఉంటుం దనీ హీరో, హీరోయిన్‌ పాత్రల ద్వారా చెబు తుంది– ‘నిండు దంపతులు’. సముద్రాల జూనియర్‌ డైలాగ్స్‌ పలు సామాజిక సమస్యలను చర్చిస్తాయి. చదువు లేని హీరో, మేనత్త కూతుర్ని చదివించి పెళ్ళి చేసుకోవాలనుకొని, నిరాశ పడే భాగం చూస్తే తర్వాతెప్పటికో వచ్చిన కె. విశ్వనాథ్‌ ‘స్వయంకృషి’ (1987) గుర్తుకొస్తు్తంది. ఇక్కడి ఎన్టీఆర్, లక్ష్మి – అక్కడి చిరంజీవి, అతను చదివించే సుమలత పాత్రలు అయ్యాయనిపిస్తుంది. ‘‘స్త్రీ విద్య ప్రధానాంశంగా ‘నిండు దంపతులు’ కథ, స్క్రీన్‌ప్లే రాసుకున్నా. అప్పటికి అది రివల్యూషనరీ థాట్‌. కానీ, సినిమా అనుకున్నంత ఆడలేదు. అందుకని హీరో, తన మనసుకు దగ్గరైన అమ్మాయిని చదివించడం అనే అంశం ‘స్వయంకృషి’లో మళ్ళీ వాడాం. అయితే, ‘స్వయంకృషి’ కథ, ట్రీట్‌మెంట్‌ పూర్తిగా వేరు’’ అని విశ్వనాథ్‌ ‘సాక్షి’కి వివరించారు.

హీరో పాత్రకు కిళ్ళీ కొట్టు స్ఫూర్తి... ‘నిండు దంపతులు’లో ఎన్టీఆర్‌ వేసిన కిళ్ళీకొట్టు రాములు పాత్రకు ఓ నిజజీవిత పాత్ర ఓ రకంగా స్ఫూర్తి. అప్పట్లో బెజవాడలో శ్రీలక్ష్మీ టాకీస్‌ ఎదురు సందులో ‘రాములు కిళ్ళీ షాపు’ చాలా ఫేమస్‌. అక్కడ రాములు కట్టే రకరకాల, రుచికరమైన కిళ్ళీల కోసం అప్పట్లో జనం క్యూలు కట్టేవారు. ‘‘సినిమాలో హీరో పాత్ర కూడా రకరకాల కిళ్ళీలు కడుతుంది. షూటింగ్‌లో కిళ్ళీ తయారీ దృశ్యాల కోసం బెజవాడలోని ఆ షాపు నుంచి ప్రత్యేకంగా కిళ్ళీ కట్టే వ్యక్తిని తెప్పించాం’’ అని నిర్మాత జగన్నాథరావు పెద్దబ్బాయి చంద్రకుమార్‌ (చిన్ని) తెలిపారు.

అరుదైన రికార్డ్‌ ఆ జంట సొంతం!
ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్‌లో తెరపై బహుముఖ పార్శా్వలు కనిపిస్తాయి. ప్రేయసీ ప్రియులు (కార్తవరాయని కథ, ఇంటిగుట్టు వగైరా) మొదలు భార్యాభర్తలుగా (గుండమ్మ కథ), అన్యోన్య దంపతులుగా (విచిత్ర కుటుంబం), అన్నా చెల్లెళ్ళుగా (రక్త సంబంధం), బాబాయి – కూతురుగా (మాయాబజార్‌), వదిన – మరుదులుగా (కోడలు దిద్దిన కాపురం), అక్కా తమ్ముళ్ళుగా (వరకట్నం), ప్రతినాయిక – నాయకులుగా (చంద్రహారం), కథను నడిపించే వేశ్య– యాంటీ హీరోగా (కన్యాశుల్కం), కథ ప్రకారం తల్లీ కొడుకులుగా (సర్కస్‌ రాముడు) ... ఇలా ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన బంధాలను వారిద్దరి జంట వెండి తెరపై అవలీలగా ఒప్పించింది. జనాన్నీ  మెప్పించింది. ఒక టాప్‌ హీరో, టాప్‌ హీరోయిన్‌ కలసి జంటగా ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం సినిమా చరిత్రలో మరెక్కడా కనపడని విషయం.


- రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు