Waltair Veerayya and Veera Simha Reddy: చిరు Vs బాలయ్య.. బాక్సాఫీస్‌ కింగ్‌ ఎవరు?

7 Jan, 2023 19:21 IST|Sakshi

సంక్రాంతి వస్తోందంటే సంగ్రామం వస్తోందనే అర్ధం. అది అలాంటిలాంటి సంగ్రామం కాదు. మహా సంగ్రామం.. దశాబ్ధాలుగా తెలుగునాట సంక్రాంతి పండగ వేదికగా అగ్రనటులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య పెద్ద యుద్ధం జరుగుతూ వస్తోంది. ఈ సంక్రాంతికీ ఈ ఇద్దరూ తమ సత్తా చాటుకోడానికి సిద్ధంగా ఉన్నారు. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, వీర సింహారెడ్డిగా బాలయ్యలు తొడలు గొట్టి మరీ యుద్ధానికి సై అంటున్నారు.

ఆ నటులే కాదు వారి అభిమానుల మధ్య కూడా అలాంటి యుద్ధ వాతావరణమే నెలకొంది. ఇది ప్రొఫెషనల్ ఫైట్. ఈ ఫైట్‌లో సత్తా చాటిన వారే వీరుడు. ఈ సంక్రాంతి వీరుడెవ్వరనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.88 కోట్లు కాగా వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.73 కోట్లు. ఈ విషయంలో మెగాస్టారే కాస్త ముందున్నాడు.

ఈ ఇద్దరు అగ్ర హీరోల ప్రీవియస్ సినిమాల ప్రభావం కూడా ఈ రెండు చిత్రాలపై ఉంటుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. చిరు నటించిన ఆచార్య ఫ్లాప్‌గా మిగిలింది. తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్‌కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం నిరాశపరిచాయి. బాలయ్య విషయానికి వస్తే.. అఖండ విజయంతో మాంచి ఊపు మీదున్నాడు. మరోవైపు అన్ స్టాపబుల్‌ ప్రోగ్రామ్ సక్సెస్ వైబ్స్ కూడా బాలయ్యకు కలసి వచ్చే అంశాలే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు ప్రమోషన్ విషయంలో తెగ్గేదే లే.. అంటూ దూసుకెళుతున్నారు. దాంతో రెండు సినిమాలపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రెండు సినిమాల ట్రైలర్లు, టీజర్లు, పాటలు.. సినీ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు సోషల్ మీడియాలో ఇటు యూట్యూబ్‌లో సంచలనంగా మారాయి.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. ఈ రెండు చిత్రాలనూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించింది. సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేసి ఈ రెండు సినిమాలనూ రిలీజ్ చేస్తున్నారు. రెండు సినిమాల్లోనూ  హీరోయిన్ శ్రుతీహాసనే. ఇప్పటికే ఈ భారీ చిత్రాల బుకింగ్ మేళా మొదలైంది. అమెరికా, యూకేతో పాటు ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ స్టార్ట్ అయ్యాయి.

ముందుగా జనవరి 12న వీరసింహారెడ్డి వస్తున్నాడు. వీరసింహా రెడ్డి గర్జనలతో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి ఈనెల 13న బాస్ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. వాల్తేరు వీరయ్యలో ఎక్స్ ట్రా మాస్ ఎలిమెంట్ ఉంది. అదే మాస్ మహారాజ్ రవితేజ. మెగాస్టార్‌కు తోడు ఓ ఇంపార్టెంట్ రోల్‌లో మాస్ రాజా కనిపించబోతున్నాడు. 

మొత్తానికి పొంగల్ పోటీకి రంగం సిద్ధమైంది. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య చిరు, బాలయ్య సినిమాలు రాబోతున్నాయి. మరి ఈ ఇద్దరు అగ్ర హీరోల్లో ఎవరు విజయపతాకం ఎగురవేస్తారు.. ? ఒక్కరే విన్నర్ గా నిలుస్తారా.. ? లేక ఇద్దరూ ఇరగదీస్తారా.. ? ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ వసూళ్లలో ఎవరు ముందుంటారు.. ? ఓవరాల్ రన్ లో బాక్సాఫీస్ కింగ్ ఎవరు.. ? అతి త్వరలోనే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు దొరకబోతున్నాయి.

చదవండి: మాస్‌ డైలాగులతో దద్దరిల్లిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు