పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌.. సీఎం జగన్‌ సాయం మరోసారి తెరపైకి

10 Mar, 2024 14:10 IST|Sakshi

న‌టి పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంటారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన స్టైల్‌లో ఆమె స్పందిస్తూ ఉంటారు. కరోనా సమయంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై కొద్దిరోజుల క్రితం ఆమె ప్రసంశించారు. 'కోవిడ్ మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతగానో అండగా నిలిచిందని ఆమె కొనియాడారు. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఆమె తన ఎక్స్‌ పేజీలో పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న తీరుపై నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.

ఏపీలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌యిపోయి, బంప‌ర్ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తొలి ఏడాదిలోనే కోవిడ్‌ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఏడాదిలోనూ పూర్తిగా కోవిడ్‌ ఆంక్ష‌ల మ‌ధ్య‌నే ఆయన పాలన సాగింది. అలా రెండేళ్ల పాటు కరోనాపై ఏపీ ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాల ఆర్థిక స్థితిగతులు తలక్రిందులయ్యాయి.

క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు మాత్రం పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు ఎన‌లేని మేలు చేశాయి. ఆ ప‌రిస్థితుల్లో ఎందరో ఉపాధి కోల్పోయి లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. పనిచేస్తున్న చోట కరోనా పేరుతో జీతాలలో కోతలు పడటమే కాకుండా ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో అనేక మందికి సీఎం జగన్‌ ఇస్తున్న ఈ ప‌థ‌కాలు ఎంతో ల‌బ్ధిని చేకూర్చాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రైతులు, అమ్మ ఒడి ల‌బ్ధిదారులు, చేతి వృత్తుల వాళ్లు, కుల వృత్తుల వాళ్లు, ఆటోలు న‌డుపుకునే వాళ్లు, పూజారులు, పాస్ట‌ర్లు, ఇమామ్ లు.. ఇలా వాళ్లూ వీళ్లూ అనే తేడాలు లేవు. కులాల వారీగా కూడా సంక్షేమ ప‌థ‌కాలు వేరే! ప్రజల క్షేమం కోరుకున్న ఆయనపై ప్రతి పక్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా, పంచుడు కార్య‌క్ర‌మాలు అంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నా.. సీఎం జ‌గ‌న్ త‌న దారిలో వెన‌క్కు త‌గ్గ‌లేదు. అప్పు చేసైనా సరే ముందుగా ప్రజల ఆకలి తీర్చాలని జగన్ భావించారు. కరోనా సమయంలో కేవలం రేషన్ సరకులు పంపించి కేంద్రం చేతులు దులుపుకుంది.

అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి సామాజిక వర్గానికి ఏదో ఒక రూపంలో నగదు బదిలీ చేస్తూ ఆర్థికంగా ఆదుకున్నారు. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి అండగా నిలిచింది. అప్పుడు ఆ వ్యవస్థ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, సంక్షేమ పథకాలు కుంటుపడగా.. ఏపీలో మాత్రం ఇంటింటికి సంక్షేమ ఫలాలు, రేషన్, పింఛన్లు క్రమం తప్పకుండా అందాయి. దీనంతటికి కారణం సీఎం జగన్ తీసుకున్న డైనమిక్‌ నిర్ణయాలు అని చెప్పవచ్చు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థపై దేశవ్యాప్తంగా అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

కరోనా కష్టకాలంలో ఎవరు ఏంటి? అనే విషయం అప్పట్లో క్లియర్‌గా తేలిపోయింది. రోగానికి భయపడి చంద్రబాబు, పవన్‌ హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. కానీ సీఎం జగన్‌ మాత్రం తన మంత్రుల సమీక్షలతో ప్రజలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. అలాంటి కష్ట-నష్ట కాలంలో కూడా ప్రజల బాగోగులు పట్టించుకున్న ఏకైక సీఎంగా రికార్డులకెక్కారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.

అప్పట్లో పారాసెట్మాల్ వేసుకోమని జగన్‌ గారు చెబితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కామెడీ చేశారు, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటే ఎకసెక్కాలాడారు. అలా నోరు చేసుకున్నోళ్లంతా చివరకు సీఎం జగన్‌ చెప్పిన సూత్రాలనే ప్రపంచవ్యాప్తంగా పాటించారు. కోవిడ్‌ సమయంలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న దశలోనూ ఎలాగైనా ప్రజలకు ఆర్థిక సాయం అందించడం కోసం ఆయన అనునిత్యం తపనపడ్డారు.

మరోవైపు కరోనా కట్టడిపై ఏపీని దేశానికే ఆదర్శంగా మార్చారు జగన్. అత్యథిక వ్యాధి నిర్థారణ పరీక్షలు జరిపిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందంటే ఆ ఘనత జగన్‌ది కాక ఇంకెవరిది. కనీసం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ టీకాలు కూడా దొరకకపోవడంతో బార్డర్‌ దగ్గరగా ఉన్న ప్రజలు ఏపీలోకి వచ్చి టీకాలు తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తమ ఇంటికి సంతోషంగా వెళుతున్న సమయంలో రూ. 2000 వారి జేబులో పెట్టి పంపించారు. లాక్‌డౌన్‌ సమయంలో వాహనాలు లేకపోవడంతో కాలినడక ద్వార తమ గమ్యానికి చేరుకోవాలని ఎందరో రోడ్డు బాట పట్టారు.

వారిలో కొందరికి కనీసం చెప్పులు కూడా లేని పరిస్థితి. అలాంటి వారి కోసం పలు చోట్ల చెప్పుల స్టాండ్లను కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదేమైనా పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది లాగే సీఎం జగన్ కూడా అసలైన కరోనా వారియర్ అని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేసేవారు. కరోనా కష్ట సమయంలో ఏపీ సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రజల పట్ల చూపిన అంకిత భావాన్ని పూనమ్‌ తాజాగా కొనియాడటంతో మరోసారి నెటిజన్లు కూడా ఆనాటి రోజులను ఇలా గుర్తు చేసుకుంటున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు