Puneeth Rajkumar: బళ్లారి జిల్లాతో పునీత్‌కు విడదీయలేని బంధం.. ఎలా అంటే..!

30 Oct, 2021 07:58 IST|Sakshi
బళ్లారికి విచ్చేసినప్పుడు పునీత్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు (ఫైల్‌) 

సినిమా షూటింగ్‌లకు పలు పర్యాయాలు బళ్లారికి 

పునీత్‌ అకాల మృతితో అభిమానుల కంటతడి  

Puneeth Rajkumar Bonding With Bellary: పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు బళ్లారి జిల్లాతో విడదీయరాని బంధం ఉంది. సినిమా చిత్రీకరణల సందర్భంగా  అనేక పర్యాయాలు  జిల్లాలో పర్యటించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఉత్తమ నటన, ఆయన ఉత్తమ వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే గుణం కారణంగా జిల్లాలో ఆయనకు లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన చిత్రాలు జిల్లాలో వంద రోజులపాటు ప్రదర్శించారు.

పునీత్‌రాజ్‌కుమార్‌ గురు రాఘవేంద్ర స్వామి భక్తుడు కావడంతో మంత్రాలయం వెళ్లినప్పుడు బళ్లారికి వచ్చి వెళ్లేవారు. బళ్లారికి వచ్చిన ప్రతిసారీ  వేలాదిగా అభిమానులు ఘన స్వాగతం పలికేవారు. ఆయన నటించిన సినిమాలు బళ్లారిలోని శివ థియేటర్‌లో వంద రోజులపాటు ప్రదర్శించామని బళ్లారి సినిమా థియేటర్ల ఆసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, హనుమంతరెడ్డిలు తెలిపారు. పునీత్‌రాజ్‌కుమార్‌ మృతికి సంతాపసూచకంగా బళ్లారిలో సినిమా థియేటర్లను మూసివేశారు. 

శ్రద్ధాంజలి ఘటించిన అభిమానులు
పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకాల మరణంతో అభిమానులు కంటతడిపెట్టారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అప్పు సేవా సమితి, రాజ్‌కుమార్‌ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో రాయల్‌ సర్కిల్‌కు చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నటరాజ్‌ థియేటర్‌ యజమాని లక్ష్మీకాంత్‌రెడ్డి, పునీత్‌ అభిమానులు కప్పగల్‌ చంద్ర«శేఖర్‌ ఆచారి, మంజునాథ్,› ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: (పునీత్‌ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!)

గంగావతి: బస్టాండ్‌ సర్కిల్‌లో పునీత్‌ రాజ్‌కుమార్‌ చిత్ర పటం ఉంచి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఆర్‌ శ్రీనాథ్‌ మాట్లాడుతూ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు పంపణ్ణనాయక్, చెన్నబసవ జైకిన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.   

రాయచూరు రూరల్‌: నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాల మరణంతో రాయచూరు జిల్లాలో అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. కన్నడపర సంఘటనల సంచాలకుడు అశోక్‌ కుమార్‌ జైన్, గోవింద రాజులు, నరసింహులు, సాధిక్, బసవరాజ్‌ కళస, శివకుమార్‌యాదవ్, రవి, అశోక్‌ శెట్టి, రమేష్, రాజశేఖర్, వినోద్‌ రెడ్డి, శరణప్ప, మాజీ ఎమ్మెల్సీ బోసురాజ్, ఎమ్మెల్యే శివరాజ్‌ పాటిల్, మంత్రాలయం రాఘవేంద్ర స్వాముల మఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్‌లు సంతాపం వ్యక్తం చేశారు. 

కంప్లి: పునీత్‌రాజ్‌కుమార్‌ మృతితో కంప్లిలో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.  ఎమ్మెల్యే గణేష్‌ కార్యాలయం వద్దకు పునీత్‌ అభిమానులు చేరుకుని పునీత్‌ రాజ్‌కుమార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి సమర్పించారు. 

మరిన్ని వార్తలు