Puri Jagannadh: ఆమెపై కోప్పడినందుకు ఏం చేయాలో సరిగ్గా చెప్పి చావు అని తిట్టింది

15 Dec, 2022 16:36 IST|Sakshi

లైగర్‌ డిజాస్టర్‌ తర్వాత సోషల్‌ మీడియాకు బ్రేక్‌ ఇచ్చిన పూరీ జగన్నాథ్‌ తిరిగి అభిమానులతో టచ్‌లోకి వస్తున్నాడు. పూరీ మ్యూజింగ్స్‌ పేరిట నిత్యం ఏదో ఒక అంశంపై ఫిలాసఫీ బోధిస్తున్నాడు. తాజాగా ఆయన బ్యాలెన్స్‌డ్‌గా రిప్లై ఇవ్వడం ఎలా? అనేది వివరించాడు. అంతేకాకుండా దీనికి ఇడియట్‌ మూవీ షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు.

'జీవితంలో చాలా జరుగుతుంటాయి. వాటిమీద మనకు ఎలాంటి కంట్రోల్‌ ఉండదు. ఏం జరిగితే ఎలా రియాక్ట్‌ అవుతున్నామనేదే మన చేతుల్లో ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా కామ్‌గా రియాక్ట్‌ అవాలి. అరిచి గోల చేయడం, తల గోడకేసి కొట్టుకోవడం వంటివి చేయకూడదు. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సమస్య ఎప్పుడూ సమస్య కాదు. ఆ సమస్యకు మీరు స్పందించే విధానమే అసలైన సమస్య. మనుషులకు ఎలా రియాక్ట్‌ అవుతున్నాం? పరిస్థితులకు  ఎలా రియాక్ట్‌ అవుతున్నాం? లేదా ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే దానికి ఎలా సమాధానమిస్తున్నామన్నది ముఖ్యం.

బ్యాలెన్సెడ్‌గా, ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏం మాట్లాడినా మన భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకుని మాట్లాడాలి. విపరీతమైన కోపంలో ఉంటే అస్సలు ఆన్సర్‌ చేయకండి, సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోండి. చాలాసార్లు ఏమీ ఎక్స్‌ప్రెస్‌ చేయకపోవడం చాలా మంచిది. అవతలి మనిషి కోపంలో ఉన్నప్పుడు నవ్వుతూ రియాక్ట్‌ అవండి, వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు.

ఇడియట్‌ సినిమా షూటింగ్‌లో ఏడ్చే సన్నివేశంలో రక్షిత విపరీతంగా పగలబడి నవ్వుతోంది. నాకు కోపం వచ్చింది. సెట్‌లో అందరూ వింటుండగా చాలా గట్టిగా చెప్పా.. రక్షిత నువ్వు ఫోకస్‌ చేయట్లేదు, ఇలాగైతే నెక్స్ట్‌ సినిమాలో నీకు క్యారెక్టర్‌ రాయను అని చెప్పాను. ఆమె వెంటనే రాయాలి, రాయకపోతే చంపేస్తా! నీ తర్వాతి  10 సినిమాలు నేనే చేస్తా.. ఇప్పుడు నీకేం కావాలో సరిగా చెప్పి చావు అంది. అంతే, ఆమె రెస్పాన్స్‌కు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ మాటలకు నాకూ నవ్వాగలేదు. ఎందుకంటే ఊహించని పాజిటివ్‌ రెస్పాన్స్‌ అది. దెబ్బతో ఆమె మీద కోపం పోయింది. అలా కాకుండా నేనన్న మాటలకు ఇన్సల్ట్‌గా ఫీలై ఏడుస్తూ సెట్‌లో నుంచి వెళ్లిపోవచ్చు. అలిగి రెండో రోజు షూటింగ్‌కు రావడం మానేయొచ్చు.. కానీ తనలా చేయలేదు.

అందుకే మన రియాక్షన్స్‌తో జీవితంలో చాలా నాన్సెన్స్‌ను కట్‌ చేయొచ్చు. అలాగే సోషల్‌ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్‌ పెడితే ప్రత్యేకంగా రియాక్ట్‌ కానవసరం లేదు. ఎక్కడో ఏదో జరిగితే మనం వైల్డ్‌గా రియాక్ట్‌ అయి పదిమందితో వాదించి గొడవపెట్టుకోవడం అవసరమా? కాబట్టి మనకు పనికొచ్చేవాటికే మనం రియాక్ట్‌ కావాలి. నవ్వుతూ సమాధానం చెప్పండి. లేదంటే ఎలాంటి బదులివ్వకుండా చిన్న చిరునవ్వుతో  చాలా సమస్యలను పరిష్కరించవచ్చు' అని చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్‌.

చదవండి: మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌కు శ్రీసత్య బలి
పవన్‌ కల్యాణ్‌ సినిమా నుంచి తప్పుకున్న పూజా హెగ్డే

మరిన్ని వార్తలు