జనం కోసం ఆడిపాడారు

5 Aug, 2020 03:17 IST|Sakshi

దర్శక–నిర్మాత–నటుడు ఆర్‌. నారాయణమూర్తి

నా మొదటి సినిమా ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’కి వంగపండు పాటలు రాశారు, పాడారు, నటించారు కూడా. ఆ సినిమా విజయానికి ఎంతో దోహదపడ్డారు. ఆయన ప్రజలకోసం రాసి, ఆడి, పాడి ప్రజల మనిషయ్యారు. మా వ్యక్తిగత విషయాల్ని పంచుకునేంత గొప్ప స్నేహం మాది. నా సినిమాలు ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ మొదలుకొని ‘ఆలోచించండి’, ‘భూపోరాటం’, ‘అడవి దివిటీలు’, ‘చీమలదండు’, ‘అన్నదాత సుఖీభవ’ తదితర చిత్రాలకు పాటలు రాయడంతో పాటు నాలుగైదు సినిమాల్లో నటించారాయన. నా ‘దండకారణ్యం’ చిత్రంలో ఆయనతో ప్రజాకవి వేషం వేయిద్దామనుకున్నాను. ఆ కవిని పోలీసులు నిర్భందించి, టార్చర్‌ పెట్టే సన్నివేశం ఉంది. ఆ సమయంలో ఆయన యాంజియోగ్రామ్‌ చేయించుకున్నారు.

ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు వంగపండుని తోసేస్తే అప్పుడు ఆయనకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనని, ‘ఈ వేషం మీరు వేయొద్దు సార్‌’ అని చెప్పాను. ఆయన చాలా ఫీలై, ఆ వేషం నేను వేయగలను అన్నారు. వృత్తిపట్ల ఆయనకున్న సెంటిమెంట్, అంకితభావం అలాంటిది. కానీ నేను ఆ పాత్ర చేయించలేదు. ‘ఏం పిల్లడో ఎల్ద మొస్తవా..’, ‘యంత్రమెట్లా నడుస్తున్నదంటే...’, ‘ఎక్కడపుట్టి ఎక్కడ పెరిగామో...’, ‘మా పోరు ప్రజా పేరు...’, ‘రైతు తిరుగుబాటు..’, ఇలా నా చిత్రాల్లో ఎన్నో పాటలు రాశారు, పాడారు. జానపద కవిగా, పీడిత ప్రజల పక్షపాతిగా ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. 

మరిన్ని వార్తలు