Chandra Mohan: అంగుళం పొడుగ్గా ఉంటే హీరోగా తొక్కేసేవారే.. స్వయంగా ఏఎన్నార్‌..

11 Nov, 2023 13:54 IST|Sakshi

చంద్రమోహన్ విలక్షణ నటుడే కాదు ఆయన మాటల్లో హాస్యం తళుక్కుమంటుంటుంది... పంచ్‌లు కూడా పడుతుంటాయి. కృష్ణాజిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ 'రంగుల రాట్నం’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. హీరోగా, కమెడీయన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 900లకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నేడు(నవంబర్‌ 11న) ఉదయం కన్నుమూశారు.

ఆయనను కలుసుకున్న అదృష్ణవంతుణ్ని
చంద్రమోహన్‌ను ఓసారి కలుసుకున్న అదృష్ణవంతుణ్ని నేను. జర్నలిజం స్కూల్‌లో కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు సినీ జర్నలిజం విద్యార్థుల్ని చెన్నైకి తీసుకెళ్ళాను. అప్పుడు కలిసిన చాలా మంది సినిమా ప్రముఖుల్లో చంద్రమోహన్ ఒకరు. ఆయన వద్దకు వెళ్ళే సరికి సాయంత్రం అయ్యింది. అంతకు ముందే హీరో శోభన్ బాబుగారితో మట్లాడి వచ్చాము. మమ్మల్ని చూడగానే సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు. సినీ జర్నలిజం విద్యార్థులని పరిచయం చేశాను.

ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా?
చంద్రమోహన్ గారు నవ్వుతూ... వెరీ గుడ్... మున్ముందు మీరడిగే చాలా ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో అంటూనే ఒకమాట గుర్తుంచుకోండి. కవరేజీ ఎలా చేశామనే అలోచించండి. ఎందుకంటే చాలామంది మీ వాళ్ళు కవరేజీ కన్న కవర్లేజీ పైనే మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు అని ఓ పంచ్ వేశారు. హీరో శోభన్ బాబుగారిని కలిసి వచ్చామని చెప్పగానే.. ఆహా అలాగా... ఇంట్లోకి రానిచ్చాడా, గేటు వద్దే పంపించేశాడా? తనకు ఇవన్నీ ఇష్టముండవు అంటూ చెణుకు విసిరారు.

(చదవండి: వంద కోట్ల ఆస్తి పోగొట్టుకున్న చంద్రమోహన్‌.. ఒకటో తారీఖు వస్తే చాలు..)

నక్క తోక తొక్కారు, లేదంటే..
లేదు సార్ గంటపైగా మాట్లాడారు అని అనగానే అయితే కచ్చితంగా మీరేదో నక్కతోక తొక్కే వచ్చి ఉంటారు. సినిమాకు సంబంధించి ఏ విషయం ఇంట్లో ఆయన మాట్లాడరు. సినిమా వాళ్ళను లోపలికి కూడా రానీయరు. అంతెందుకు... సినిమా పత్రికలు కూడా గేటు దాటే వీల్లేదని చెబుతూనే.. అందుకే చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అంటూ మరో పంచ్ వేశారు. తనతో ఉన్న గంటసేపు చాలా కబుర్లు చెప్పారు. తమ సినీ జీవన ప్రస్థానం తెలిపారు. ఇప్పటికీ చంద్రమోహన్ అన్న కవరేజా...కవర్లేజా అన్నమాట నాకు గుర్తొస్తునే ఉంటుంది.

స్వయంగా ఏఎన్నార్‌ ఆ మాటన్నారు
చంద్రమోహన్ లక్కీ స్టార్ అవునో కాదో తెలీదు కానీ, ఆయనతో నటించిన చాలా మంది హీరోయిన్లు లక్కీస్టార్లుగా ఎదిగిపోయారు. జయసుధ, శ్రీదేవి, రాధికా తదితరుల్ని ఈ జాబితాలో చెప్పవచ్చు. చంద్రమోహన్ మరో అంగుళం పొడుగ్గా ఉంటే మమ్మల్ని తొక్కేసి హీరోగా వెళ్ళిపోయేవాడు.. ఈ మాట సాక్షాత్తు అక్కినేని నాగేశ్వరరావే అన్నారంటే ఆయనెంత విలక్షణ నటుడో తెలుస్తుంది. నవరసాలు అవలీలగా పండించే అలాంటి హీరోతో కాసేపు మాట్లాడానన్న తృప్తి అయితే ఉంది. ఎందుకో ఇవాళ...ఆ హీరో మరో లోకానికి వెళ్ళారనగానే ఆ సందర్భం గుర్తొచ్చింది.
- రామదుర్గం మధుసూదన రావు

చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్‌ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో..

మరిన్ని వార్తలు