RRR Collections in Japan: జపాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్-2ను దాటే ఛాన్స్?

8 Nov, 2022 18:42 IST|Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద  ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ దూసుకెళ్తోంది. అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా అమిర్ ఖాన్ బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రికార్డును అధిగమించింది.

జపాన్‌లో విడుదలైన 17 రోజుల్లోనే 185 మిలియన్ల జపాన్ యెన్‌ల వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. గతంలో రజినీకాంత్ నటించిన ముత్తు చిత్రం జపాన్‌లో 400 మిలియన్ల జపాన్ యెన్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బాహుబలి- 2 300 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా 185 మిలియన్లతో ఆర్ఆర్ఆర్ మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో రెండు సినిమాలు రాజమౌళి తెరకెక్కించినవే.

(చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!)

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ  త్వరలోనే కేజీఎఫ్‌-2 అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవనుందా? అనే నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1150 కోట్లు వసూళ్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్. యష్ నటించిన కేజీఎఫ్-2 రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లతో ఆ రికార్డును బద్దలు కొట్టింది.

ప్రస్తుతం జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోనే జపాన్ కరెన్సీలో 185 మిలియన్ల(రూ.10 కోట్లు) వసూళ్ల రాబట్టిందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. ఇకముందు ఇదే జోరు కొనసాగిస్తే 2022లో కేజీఎఫ్ కలెక్షన్లను దాటి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించే అవకాశముంది.

మరిన్ని వార్తలు