కడపలో కూతురు మాటలకు క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్‌

30 Jan, 2024 07:12 IST|Sakshi

రజనీకాంత్‌ అతిథిగా పవర్‌ఫుల్‌ పాత్రను పోషించిన చిత్రం లాల్‌ సలాం. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ నటించిన ఈ చిత్రానికి రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు.

దర్శకురాలు ఐశ్వర్య మాట్లాడుతూ నిజానికి తన తండ్రి సంగీ కాదని ఆయన సూపర్‌స్టార్‌ అని అన్నారు. సంఘీ అయితే లాల్‌ సలాం చిత్రంలో ఆయన నటించే వారే కాదని పేర్కొన్నారు. సంఘీ అంటే మతవాది అనే అర్థం వస్తుంది. కాగా రజనీకాంత్‌ సోమవారం ఉదయం జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నటిస్తున్న వేట్టైయాన్‌ చిత్ర షూటింగ్‌ కోసం ఏపీలోని కడప వెళ్లారు.

అక్కడ విమానాశ్రయంలో మీడియాతో ఐశ్వర్య మాట్లాడిన సంఘీ అంశం గురించి ప్రశ్నించగా సంఘీ అంటే చెడ్డ పదం కాదని రజనీకాంత్‌ స్పష్టం చేశారు. ఐశ్వర్య ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. తన తండ్రి ఒక ఆధ్యాత్మిక భావాలు కల వ్యక్తి అని.. ఎందుకు అలాంటి దృష్టిలో చూస్తారని మాత్రమే అన్నారని వివరించారు. అయినా ఈ చర్చ లాల్‌ సలాం చిత్ర ప్రచారం కోసం కాదని, లాల్‌ సలాం చిత్రం అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు