కొత్త విభాగంలో అక్క ఫైటర్‌: రాంచరణ్‌

23 Dec, 2020 08:50 IST|Sakshi

‘షూట్‌–అవుట్‌ ఎట్‌ ఆలేరు’ షో రీల్‌ విడుదల చేసిన రామ్‌ చరణ్‌

‘మనందరికీ ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది. ఈ ఏడాది చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు చిత్ర పరిశ్రమ మళ్లీ తన కాళ్ల మీద నిలబడింది’’ అన్నారు రామ్‌చరణ్. ‘ఓయ్‌’ మూవీ ఫేమ్‌ ఆనంద్‌ రంగా దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘షూట్‌–అవుట్‌ ఎట్‌ ఆలేరు’. హీరో చిరంజీవి కుమార్తె, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్‌ నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 25నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రకాశ్‌ రాజ్, శ్రీకాంత్, నందినీ రాయ్, తేజా కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు.

హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో రామ్‌చరణ్‌ ఈ సిరీస్‌ షో రీల్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఓయ్‌’ చాలా అందమైన సినిమా. కొన్ని నెలల పాటు ఆ సినిమా పాటలు వినేవాణ్ణి. మా అక్క, బావతో (సుష్మిత – విష్ణుప్రసాద్‌) ఆయన అసోసియేట్‌ అయి ఈ సిరీస్‌ చేయడం సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఎలా మొదలైందనేది కాదు... ఎలా ముగిసిందనేది చాలా ముఖ్యం. ‘షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు’తో మంచి ఎండింగ్‌ ఇస్తామని ఆశిస్తున్నా. ‘రంగస్థలం, ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాలకు అక్క స్టయిలిస్ట్‌గా చేసింది. కొత్త (ఓటీటీ) విభాగంలో అక్క ఫైటర్‌ అని చెప్పవచ్చు’’ అన్నారు. (చదవండి: నో చెప్పిన చెర్రీ‌.. మహేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌!)

‘‘ఓటీటీలో ఈ సిరీస్‌ గేమ్‌ చేంజర్‌ అవుతుందని ఆశిస్తున్నా. ప్రసాద్‌ నిమ్మకాయలగారి మార్గదర్శకత్వం లేకపోతే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు’’ అన్నారు విష్ణు ప్రసాద్‌. సుష్మిత మాట్లాడుతూ – ‘‘మనమే ముందుకు వెళ్లి అవకాశాల కోసం చూడాలనీ, అవి వచ్చినప్పుడు తీసుకోవాలని నాన్నగారు  చెబుతుంటారు. అటువంటి స్ఫూర్తి ఇవ్వడంతో పాటు కొండంత అండగా నిలబడిన నాన్నగారికి థ్యాంక్స్‌’’ అన్నారు. డైరెక్టర్‌ నందినీరెడ్డి సినిమాటోగ్రాఫర్‌  అనిల్‌ బండారి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ నరేష్‌ కుమారన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శరణ్య తదితరులు పాల్గొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు