Aranya Movie Review : రానా ‘అరణ్య’ మూవీ ఎలా ఉందంటే...

26 Mar, 2021 00:30 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : అరణ్య
నటీనటులు :  రానా దగ్గుబాటి,  విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ
దర్శకత్వం : ప్రభు సాల్మన్
సంగీతం : శాంతను మొయిత్రా
సినిమాటోగ్రఫీ : ఏఆర్ అశోక్ కుమార్ 
ఎడిటింగ్ : భువన్ శ్రీనివాసన్
డైలాగ్స్ : వనమాలి 
విడుదల తేది : మార్చి 26, 2021

కథ
నరేంద్ర భూపతి అలియాస్‌ అరణ్య(రానా దగ్గుబాటి) ప్రకృతి ప్రేమికుడు. అడవులు, వన్యప్రాణులు అంటే ఆయనకు ప్రాణం. ఆయన తాతలు 500 ఎకరాల అడవిని ప్రభుత్వానికి రాసిచ్చెస్తే... ఆయన ఆ అడవికి, అక్కడి వన్యప్రాణులకు సంరక్షకుడిగా ఉంటాడు. లక్షకు పైగా మొక్కలు నాటి రాష్ట్రపతి చేత ఫారెస్ట్‌ మాన్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు అందుకుంటాడు. అడవిలోనే ఉంటూ అక్కడి ఏనుగులకు, గిరిజనులకు అండగా ఉంటాడు. ఇదిలా ఉంటే.. అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం(అనంత్‌ మహేదేవన్‌) ఆ అడవి స్థలంపై కన్నుపడుతుంది. అక్కడ డీఆర్‌ఎల్‌ టౌన్‌షిప్‌ని నిర్మించాలని భావిస్తాడు. దీని కోసం 60 ఎకరాల అడవిని నాశనం చేయాలనుకుంటాడు. దీనిని ప్రకృతి ప్రేమికుడు అరణ్య ఏ విధంగా అడ్డుకున్నాడు? తన కలల ప్రాజెక్టుకు ఆటంకం కలిగించిన అరణ్యను మంత్రి ఏవిధంగా హింసించాడు? చివరకు అడవిని, ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ.

నటీనటులు
వైవిధ్యమైన పాత్రలు, క‌థా చిత్రాల్లో న‌టించే అతికొద్ది మంది నటుల్లో రానా ఒకరు. కెరీర్‌ ప్రారంభం నుంచే వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు. పాత్ర ఏదైనా అందులో పరకాయప్రవేశం చేయడం రానా నైజం. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. చెట్లు, ఏనుగుల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా అరణ్య పాత్రలో రానా పరకాయ ప్రవేశం చేశాడు.ఆయన నటకు ఎక్కడా కూడా వంకపెట్టలేము. అరణ్య పాత్ర కోసం రానా పడిన కష్టమంతా సినిమాలో కనిపిస్తుంది. సింగ పాత్రకు విష్ణు విశాల్‌ న్యాయం చేశాడు. విలేకరిగా శ్రీయా పింగోల్కర్‌, నక్సలైట్‌గా జోయా హుస్సేన్ పాత్రల నిడివి తక్కువే అయినా.. పర్వాలేదనిపించారు. ఇక విలన్‌ పాత్రలో మహదేవన్‌ ఒదిగిపోయాడు. కమెడియన్‌ రఘుబాబు నిడివి తక్కువే అయినా.. ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. 

విశ్లేషణ
మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథే ‘అరణ్య’. ప్రేమఖైదీ’, ‘గజరాజు’వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడంతో ‘అరణ్య’పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను దర్శకుడు అందుకోలేకపోయాడు. కథ బాగున్నా.. తెరపై చూపించిన విధానం బాగాలేదు. బలమైన కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ, కథనాన్ని ఎటో తీసుకెళ్లాడు. కథలోకి నక్సలైట్లను ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాదు. అలాగే మహిళా మావోయిస్ట్‌తో సింగ ప్రేమను కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు.

అడవి జంతువుల కోసం అరణ్య పోరాడుతున్న విధానం ఆకట్టుకునేలా చూపించలేకపోయాడు.అతుకుబొంతలా వచ్చే సన్నివేశాలు సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా సింపుల్‌గా సాగిపోతుందనే భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఏనుగులకు రానాకు మధ్య వచ్చిన ఎమోషనల్‌ సీన్లు కూడా తేలిపోయినట్లు కనిపిస్తాయి. అరణ్య పాత్రని కూడా ఇంకా బలంగా తీర్చిదిద్దితే బాగుండేదనిపిస్తుంది.

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజువల్‌ ఎఫెక్ట్స్‌. సినిమా నేపథ్యం అంతా అడవి చుట్టే తిరుగుతుంది. ఎక్కువ శాతం షూటింగ్‌ని అడవి ప్రాంతంలోనే జరిపారు. అడవి అందాలని తెరపై చక్కగా చూపించారు. థియేటర్లో ఉన్నామా లేదా అడవిలో ఉన్నామా అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ ఏఆర్ అశోక్ కుమార్ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం శాంతను మొయిత్రా సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. వనమాలి రాసిన డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. ఎడిటర్‌ భువన్ శ్రీనివాసన్ చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
రానా నటన
కథ
 విజువల్స్
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌
ఊహకందేలా సాగే కథనం
సాగదీత సీన్లు

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు