తమిళంపై ఫోకస్‌ పెట్టారా?

30 Aug, 2020 05:18 IST|Sakshi

తమిళ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టినట్టున్నారు సమంత. ఆమె అంగీకరిస్తున్న సినిమాలన్నీ తమిళ భాషవే కావడం అందుకు కారణం. ‘మాయ, గేమ్‌ ఓవర్‌’ చిత్రాల దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఓ సినిమా కమిటయ్యారు సమంత. ఇది ద్విభాషా చిత్రం అని సమాచారం. దాని తర్వాత విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. విజయ్‌ సేతుపతి హీరోగా నటించనున్న ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లు.

ఇదో రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ అని తెలిసింది. తాజాగా మరో తమిళ సినిమాకు కూడా ఓకే చెప్పారని కోలీవుడ్‌ టాక్‌. గౌతమ్‌ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ సమంతకు బాగా నచ్చిందని, ఆ సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం. ఈ సినిమాలో హీరో ఎవరు? ఏ జానర్‌ సినిమా అనేది ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘కత్తి, తేరీ, మెర్సల్, ఇరంబుదురై, సూపర్‌ డీలక్స్‌’ వంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో తమిళ ప్రేక్షకులకు ఫేవరెట్‌ అయ్యారు సమంత. ప్రస్తుతం ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా కమిట్‌ కాకపోవడం తెలుగు ఫ్యాన్స్‌కు చిన్న నిరాశే అని చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు