The Kashmir Files Movie: ఇది నా జీవితంలో జరిగింది, అర్ధరాత్రి కశ్మీర్‌ను వీడాం: నటి ఎమోషనల్‌

17 Mar, 2022 17:16 IST|Sakshi

ది కశ్మీర్‌ ఫైల్స్‌.. 1990లో కశ్మీర్‌ పండిట్లపై జరిగిన హింసాకాండకు వెండితెర రూపమే ఈ సినిమా! ఇది రిలీజైన నాటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తుండగా చప్పట్లతో పాటు చీదరింపులు కూడా ఎక్కువయ్యాయి. థియేటర్‌లో సినిమా చూసిన ఎంతోమంది కంటనీరుతో బయటకు వస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్‌ నటి సందీప ధర్‌ గత స్మృతులలోకి వెళ్లింది. ముప్పై ఏళ్ల క్రితం తన కుటుంబం కూడా కశ్మీర్‌ నుంచి వలసపోయిందని గుర్తు చేసుకుంది.

'కశ్మీర్‌ పండిట్లు కశ్మీర్‌ను వదిలి వెళ్లిపోవాలని ప్రకటించిన రోజది.. అప్పుడే నా కుటుంబం సొంత గడ్డను వదిలేయాలని నిర్ణయించుకుంది. అలా మేము కశ్మీర్‌ను వదిలి వెళ్లేందుకు ట్రక్కు వెనకభాగంలో దూరిపోయాం. నా కజిన్‌ మా నాన్న కాళ్ల దగ్గర ఉన్న ఒక సీటుకింద దాక్కుంది... సరిగ్గా ఇదే సన్నివేశం కశ్మీర్‌ ఫైల్స్‌లో ఉండటంతో నేను షాకయ్యాను. నా కథే నేను మళ్లీ చూసుకున్నట్లనిపించింది. మా అమ్మానాన్నల పరిస్థితి అయితే మరీ ఘోరం. సినిమా చూసిన తర్వాత వారు అత్యంత బాధాకరమైన జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. మా నానమ్మ చనిపోయింది. కానీ ఆమె పుట్టిపెరిగిన గడ్డ మాత్రం కశ్మీరే.'

చదవండి: 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' ప్రభంజనం, ఎన్ని కోట్లు సాధించిందంటే?

'ఈ ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నాకు చాలా కాలమే పట్టింది. కానీ ఇప్పటికీ మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రపంచానికి నిజాన్ని పరిచయం చేసినందుకు వివేక్‌ అగ్నిహోత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనుపమ్‌ ఖేర్‌తో సహా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ నా హ్యాట్సాఫ్‌' అని రాసుకొచ్చింది సందీప. కాగా సందీప శ్రీనగర్‌లోని కశ్మీర్‌ పండిట్‌ కుటుంబంలో జన్మించింది. అక్కడ చెలరేగిన హింసాకాండతో ఆమె కుటుంబం కశ్మీర్‌ నుంచి వలస వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే సందీప 'దబాంగ్‌ 2', 'హీరోపంతి' చిత్రాల్లో నటించింది.

A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar)

చదవండి: సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్‌

మరిన్ని వార్తలు