నటుడిగా అలరించి హీరో అవుతాను 

30 Dec, 2023 01:25 IST|Sakshi

ఆకాశ్‌

‘‘నేను హీరో కావాలనుకుంటే కాలేను. ఓ మంచి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తే, వారి నమ్మకాన్ని గెల్చుకుంటే అప్పుడు హీరో అవుతాను. మా అమ్మగారు (సునీత) స్టార్‌ సింగర్‌. ఆమె స్థాయిని ఇండస్ట్రీలో కొనసాగించాలనే విషయాన్ని నేను ఒత్తిడిగా ఫీల్‌ కావడం లేదు. నన్ను నిరూపించుకునేందుకు ఓ అవకాశంగా, ఓ బాధ్యతగా అనుకుంటున్నాను. ఇండస్ట్రీలో నా గురించి స్టార్‌ కిడ్‌ అనే మాట వినిపించినప్పటికీ నా నటనా నైపుణ్యాన్ని నిరూపించుకుని, సక్సెస్‌ కావాల్సిన బాధ్యత నాపైనే ఉంటుంది’’ అని ఆకాశ్‌ అన్నారు.

ఆకాశ్, భావన జంటగా గంగనమోని శేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘సర్కారు నౌకరి’. దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 1న రిలీజ్‌  కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆకాశ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా 1990 నేపథ్యంలో సాగుతుంది. ఆ సమయంలో దేశంలో ఎయిడ్స్‌ అనే ఓ మహమ్మారి వచ్చింది.

ముఖ్యంగా గ్రామాలు చాలా ప్రభావితం అయ్యాయి. ఈ వ్యాధి నివారణ, చికిత్సల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ప్రభుత్వోద్యోగులు. అలా ఓ గ్రామంలో వారు  చేసిన ప్రయత్నాలను ఓ వ్యక్తి చేసినట్లుగా, వన్‌ మ్యాన్‌ షోలా ఈ సినిమాను తీశాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వోద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు? తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేది ‘సర్కారు నౌకరి’ సినిమా కథాంశం.

వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. వినోదంతో పాటు ఓ చిన్నపాటి సందేశం కూడా ఉంది. నేను గిటారిస్ట్‌ని కూడా. భవిష్యత్‌లో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో పాల్గొని, సినిమా పాటలను ఎలా కం΄ోజ్‌ చేస్తారనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు.  

>
మరిన్ని వార్తలు