Shahid Kapoor: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్‌ కపూర్‌

6 Apr, 2022 15:06 IST|Sakshi

Shahid Kapoor Recalls Wife Mira Reaction After Watching Udta Punjab: విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తున్నాడు బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌ షాహిద్ కపూర్‌. తాజాగా షాహిద్‌ నటిస్తున్న చిత్రం 'జెర్సీ'. తెలుగు అర్జున్‌ రెడ్డి సినిమాను 'కబీర్‌ సింగ్‌'గా రీమెక్‌ చేసిన తర్వాత షాహిద్‌ చేస్తున్న మరో రీమెక్‌ చిత్రం ఇది. నెచురల్ స్టార్‌ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ తనను ఓ సినిమా చూసి వదిలేద్దామనుకుందంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. 

'ఉడ్తా పంజాబ్‌' చిత్రంలో తన నటనను చూసి తను రాంగ్‌ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నానని మీరా భావించినట్లు షాహిద్‌ పేర్కొన్నాడు. 'మీరా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మాకు వివాహం జరిగిన ప్రారంభంలో నా ఉడ్తా పంజాబ్‌ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్‌కు ముందు నటీనటుల కోసం ఎడిటింగ్‌ గదిలో ప్రత్యేక షో వేశారు. నేను నాతోపాటు మీరాను కూడా తీసుకెళ్లాను. సినిమా చూస్తున్నంతా సేపు మీరా మాములుగానే ఉంది. కానీ మూవీ ఇంటర్వెల్‌ సీన్‌ వచ్చాకా మీరా ప్రవర్తన చూసి షాక్‌ అయ్యాను. 

తను నా పక్క నుంచి లేచి దూరంగా వెళ్లి నిల్చుంది. నేను ఏమైందని అడిగా. దానికి తను 'నువ్‌ ఇలాంటి వాడివా ? నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా ? నువ్‌ ఆ టామీ సింగ్‌లాంటివాడివా? నీతో నేనింకా కలిసి ఉండను. నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నేను వెళ్లిపోతా.' అని చెప్పింది. తన మాటలకు ఒక్కసారిగా షాకయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తర్వాత తనకు అదంతా సినిమా. అందులోనే అలా నటిస్తారని అర్థమయ్యేలా చెబితే గానీ మీరా కుదుటపడలేదు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను.' అని షాహిద్‌  చెప్పుకొచ్చాడు. షాహిద్, మీరా 2015లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె మిషా, కుమారుడు జైన్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు