Sharmila Tagore: వెండితెరపై వెలుగు వెలిగిన హీరోయిన్‌.. ఆ బ్లాక్‌బస్టర్‌ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల్సింది!

28 Dec, 2023 15:43 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో దీర్ఘకాలం కొనసాగడం హీరోలకు చాలా మామూలు విషయం. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. వరుస ఫ్లాపులు వచ్చినా, వయసు మీదపడ్డ ఛాయలు కనిపించినా, శరీరాకృతిలో మార్పులు వచ్చినా వెంటనే రిజెక్ట్‌ చేస్తారు. స్టార్‌ హీరోయిన్‌గా కీర్తి అందుకున్నా సరే కొద్దికాలానికే తెరమరుగు అవుతుంటారు. కానీ కొందరే తమకు ఎదురయ్యే ఆటంకాలను దాటుకుని ఎక్కువ కాలంపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో సీనియర్‌ హీరోయిన్‌ షర్మిల ఠాగూర్‌ ఒకరు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు నటిగా కొనసాగిన ఈమె ఇటీవలే గుల్మొహర్‌ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. 

ఆ పాత్ర షర్మిల చేయాల్సింది
తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే 'కాఫీ విత్‌ కరణ్‌' షోకి హాజరైన షర్మిల తాను క్యాన్సర్‌తో పోరాడిన విషయాన్ని బయటపెట్టింది. ముందుగా యాంకర్‌, నిర్మాత కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. 'రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహాని సినిమాలో షబానా అజ్మీ పోషించిన పాత్ర షర్మిల చేయాల్సింది. ముందు తననే అడిగాను. కానీ తన అనారోగ్య కారణాల వల్ల ఆమె చేయనని చెప్పింది. తనతో పని చేయలేకపోయానన్న బాధ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది' అన్నాడు కరణ్‌.

క్యాన్సర్‌తో పోరాడిన సీనియర్‌ హీరోయిన్‌
దీనికి షర్మిల స్పందిస్తూ.. 'తను నాకు సినిమా ఆఫర్‌ ఇచ్చినప్పుడు కరోనా పీక్స్‌లో ఉంది. నేను వ్యాక్సిన్‌ కూడా తీసుకోలేదు. పైగా అప్పుడే నేను క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాను. అందుకే నేను రిస్క్‌ చేయడానికి నా ఫ్యామిలీ ఒప్పుకోలేదు' అని చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడు క్యాన్సర్‌ బారిన పడింది? ఎలా కోలుకుంది? అన్న విషయాలనేమీ వివరించలేదు.  ఆమె క్యాన్సర్‌తో పోరాడిన విషయం తెలిసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

సత్తా చాటిన హీరోయిన్‌
కాగా ఈమె సత్యజిత్‌ రే 'ద వరల్డ్‌ ఆఫ్‌ అపు' అనే బెంగాలీ సినిమాతో 14 ఏళ్ల వయసులోనే వెండితెర ప్రవేశం చేసింది. కొంతకాలానికే బాలీవుడ్‌లో ప్రవేశించి అక్కడా జెండా పాతింది. ఆరాధన, మౌసమ్‌ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేసింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సత్తా చాటిన షర్మిల ఇటీవలే గుల్మొహర్‌ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి సైఫ్‌, సోహ, సబ అని ముగ్గురు సంతానం. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ ప్రభుత్వం షర్మిలను 2013లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

చదవండి: నల్లగా ఉన్నాడని హేళన.. ఏడాదిలో 18 సినిమాలు

>
మరిన్ని వార్తలు