Shekar Movie Pre Release: రాజశేఖర్‌గారి వల్ల ఫేమస్‌ అయ్యా!  – డైరెక్టర్‌ సుకుమార్‌ 

18 May, 2022 01:06 IST|Sakshi
రాజశేఖర్, శివాత్మిక, సుకుమార్, శివాని, జీవిత

‘‘నా ఫ్రెండ్‌ కృష్ణ అని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. తను మా ఊర్లో అందర్నీ ఇమిటేట్‌ చేస్తుంటే నేను అసూయపడేవాణ్ణి. మొదటిసారి మా ఊర్లో రాజశేఖర్‌గారిని ఇమిటేట్‌ చేశాను.. దాంతో ఫేమస్‌ అయ్యాను. స్కూల్‌లో నన్ను రాజశేఖర్‌గారిలా చేయమంటే చేసేవాణ్ణి’’ అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. రాజశేఖర్‌ హీరోగా, ముస్కాన్, ఆత్మీయ రాజన్‌ హీరోయిన్లుగా శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు.

వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో అతిథిగా పాల్గొన్న సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్‌గారు చేసిన ‘ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం’.. ఇలాంటి సూపర్‌డూపర్‌ సినిమాలు మమ్మల్ని ఇన్‌స్పైర్‌ చేశాయి.. ఆ టైమ్‌లో ఆయనకు వీరాభిమాని అయ్యాను. సినిమాల్లోకి రాగలను, ఏదైనా చేయగలను అనే ఆలోచన నాలో ఏర్పడటానికి ఆయనే కారణం. ఆయనలోని గొప్ప విషయం ఏంటంటే.. మనందరం సినిమా పరిశ్రమలో ఉంటూ డబ్బులు, పేరు సంపాదిస్తూ మన పిల్లల్ని, కుటుంబాన్ని మాత్రం ఇండస్ట్రీకి దూరం పెడుతుంటాం. కానీ ఆయన ఇద్దరమ్మాయిలను (శివాని, శివాత్మిక) ఇండస్ట్రీకి తీసుకొచ్చినందుకు హ్యాట్సాఫ్‌. తద్వారా ఇండస్ట్రీ ఒక పవిత్రమైన  ప్రదేశం అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఒక డైరెక్టర్‌కి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది జీవితగారు అటు ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు భర్తని హీరోగా పెట్టి ఓ సినిమాకి దర్శకత్వం చేస్తూ భారాన్ని మోసినందుకు ఆమెకు దండాలు. జీవితగారి కోసమైనా ‘శేఖర్‌’ బ్లాక్‌బస్టర్‌ కావాలి’’ అన్నారు.    

రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘కరోనా వల్ల చావు అంచులదాకా వెళ్లి వచ్చి ‘శేఖర్‌’ చేశాను.. ప్రజల ఆశీర్వాదాలే నన్ను బతికించాయి. నన్ను బతికించారు.. ‘శేఖర్‌’ చూసి నా బతుకుదెరువుని కూడా బతికించండి. అందరూ థియేటర్‌కి వెళ్లి సినిమా చూసినప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా కోసం మాకంటే కూడా జీవితగారే ఎక్కువ కష్టపడ్డారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో మా పిల్లలు (శివాని, శివాత్మిక) జీవితకు ఎంతో సాయంగా ఉన్నారు’’ అన్నారు. నటుడు సముద్ర ఖని, కెమెరామేన్‌ మల్లిఖార్జున్, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు