స్టార్స్‌ స్టార్ట్‌ అయ్యారు

11 Oct, 2020 00:26 IST|Sakshi

షూటింగ్‌ లొకేషన్‌ అంటేనే సందడి. వందల మంది సవ్వడి. కరోనా వల్ల మొన్నటి వరకూ ఇండస్ట్రీని నిశ్శబ్దం ఆవహించింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. స్టార్స్‌ అందరూ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. గత సోమవారం నుంచి శనివారం వరకూ చిత్రీకరణలు ఎక్కువ ప్రారంభం అయ్యాయి. చాలామంది స్టార్స్‌ కూడా షూటింగ్‌కి స్టార్ట్‌ అయ్యారు... ఉత్సాహంగా సెట్‌లోకి అడుగుపెట్టారు. ఆ వివరాలు.

కరోనా వల్ల విదేశీ చిత్రీకరణలు సాధ్యమేనా? అనే సందేహం అందరిలోనూ ఉంది. కానీ ప్రభాస్‌ అండ్‌ టీమ్‌ షూటింగ్‌కి ఇటలీ వెళ్లి సాధ్యమే అన్నారు. అటు బాలీవుడ్‌లో లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి విదేశాలకు వెళ్లిన టీమ్‌ అక్షయ్‌ కుమార్‌ ‘బెల్‌బాటమ్‌’. తెలుగు నుంచి ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధే శ్యామ్‌’ విదేశాలు వెళ్లింది. ప్రభాస్, పూజా హెగ్డే చిత్రీకరణ ప్రారంభించారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణ కూడా ఈ వారంలోనే ప్రారంభం అయింది. ఏడు నెలల గ్యాప్‌ తర్వాత సెట్స్‌ దుమ్ము దులిపి షూటింగ్‌ షురూ చేశారు దర్శకుడు రాజమౌళి అండ్‌ టీమ్‌. ఈ చిత్రీకరణతో మళ్లీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌. ఏకధాటిగా రెండు నెలలు ఈ చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది.

‘క్రాక్‌’తో మరోసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయ్యారు రవితేజ. ఆయన కూడా విలన్స్‌ను రఫ్ఫాడించడం ఈ వారం నుంచే మొదలుపెట్టారు. సినిమా పూర్తయ్యేవరకూ చిత్రీకరణ జరపనున్నారట ‘క్రాక్‌’ టీమ్‌. టక్‌ చేసుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఈ సినిమా షూట్‌లోకి ఈ మధ్యే జాయిన్‌ అయ్యారు నాని. తన రెండు చిత్రాలు తిరిగి ప్రారంభించారు శర్వానంద్‌. ఆయన నటిస్తున్న తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం, ‘శ్రీకారం’ సినిమాలు మొదలయ్యాయి. సంక్రాంతికి ‘శ్రీకారం’తో థియేటర్స్‌లో కలుస్తారట శర్వా.

కాంట్రవర్శీలకు కాస్త బ్రేకిచ్చి తిరిగి పనిలో పడ్డారు కంగనా రనౌత్‌. జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో ఆమె నటిస్తున్నారు. చెన్నైలో కంగనా మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కత్రినా కైఫ్‌ కూడా షూటింగ్‌ మొదలుపెట్టారు. ‘ఫోన్‌ బూత్‌’ అనే కొత్త సినిమాను మొన్నే ప్రారంభించారు. రష్మికా మందన్నా కూడా ‘సుల్తాన్‌’ సినిమా సెట్‌లో ఈ మధ్యే జాయిన్‌ అయి, పూర్తి చేశారు. సంజయ్‌ లీలా భన్సాలీ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘గంగూభాయ్‌ కతియావాడీ’ని పునః ప్రారంభించారు.  గంగూభాయ్‌గా ఆలియా భట్‌ చిత్రీకరణతో బిజీ అయ్యారు.

కోవిడ్‌ జాగ్రత్తలను పాటిస్తూనే సినిమాలన్నీ చిత్రీకరిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా  పనులు జరగాలి. ఇండస్ట్రీ పరిగెత్తాలి. అందరికీ విజయం లభించాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు