Bappi Lahari: తెలుగులో బప్పి లహరి పాడిన చివరి పాట ఇదే..

16 Feb, 2022 10:18 IST|Sakshi

 ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహిరి(69) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. 1952 నవంబర్‌ 27న బెంగాల్‌కు చెందిన బ్రహ్మాణ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు అలొకేష్ లహరి. సినిమాల్లోకి వచ్చాక బప్పి లహరిగా మారిన ఆయన సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్‌ పాటతో ఓ ఊపు ఊపిన ఈ బెంగాలీ మ్యూజిక్ డైరెక్టర్.. ఆ తరువాత బాలీవుడ్‌ను తన సంగీతంతో శాసించారు. తెలుగులోనూ ఎన్నో హిట్‌ సాంగ్స్‌ అందించారు. 1986లో సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘సింహాసనం’ మూవీతో టాలీవుడ్‌కు పరిచమైన బప్పి ఆ తరువాత తెలుగులో ఎన్నో బంపర్ హిట్‌ సాంగ్స్‌ కంపోజ్ చేశారు. తండ్రి అపరేష్, తల్లి బన్సూరి ఇద్దరూ మ్యుజీషియన్స్, సింగర్స్ కావడంతో.. ఆటోమేటిక్‌గా బప్పీ లహరి కూడా మ్యూజిక్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు.  

బప్పీ తెలుగులో 1987లో త్రిమూర్తులు, 1989లో స్టేట్‌రౌడీ, 1991లో గ్యాంగ్‌ లీడర్, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, బ్రహ్మ, 1993లో నిప్పు రవ్వ, 1995లో బిగ్‌ బాస్, ఖైదీ ఇన్‌స్పెక్టర్, పుణ్యభూమి నా దేశం సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. చివరిగా తెలుగులో ఆయన 2020లో వచ్చిన రవితేజ డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. రమ్ పమ్ పమ్ అంటూ రాక్ స్టైల్‌లో పాటను పాడారు ఆయన. 

మరిన్ని వార్తలు