ప్రిన్స్ ఓ చాలెంజ్‌

20 Oct, 2022 01:47 IST|Sakshi

– శివ కార్తికేయన్‌  

‘‘ప్రిన్స్ యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. ఇందులోని డైలాగ్స్, కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉంటాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు అనే తేడా లేకుండా అందరికీ మా సినిమా నచ్చుతుంది’’ అని హీరో శివ కార్తికేయన్‌ అన్నారు. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్‌’.

శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా నటించారు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ ఆశీస్సులతో సోనాలి నారంగ్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్, డి.సురేష్‌ బాబు, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌ పంచుకున్న విశేషాలు...

► నటుడిగా అన్ని భాషల్లో మూవీస్‌ చేసి ప్రేక్షకులని అలరించాలని ఉంటుంది. ప్రస్తుతం కామెడీ సినిమాలు తగ్గిపోతున్నాయి. నాకు కామెడీ సినిమాలు చేయడం అన్నా, చూడటం అన్నా చాలా ఇష్టం. నా స్నేహితుడి ద్వారా ఒకసారి అనుదీప్‌ని కలిశాను. ఆయన చెప్పిన లైన్‌ చాలా ఎగై్జట్‌ చేయడంతో ‘ప్రిన్స్‌’ కి ఓకే చెప్పాను.

► ‘ప్రిన్స్ నా తొలి స్ట్రయిట్‌ తెలుగు ఫిల్మ్‌. ఈ ప్రాజెక్ట్‌ ఒక సవాల్‌తో కూడుకున్నది. అనుదీప్‌ తెలుగులో కథ రాశారు. తెలుగు స్క్రిప్ట్‌ని తమిళ్‌లో చేయడం ఒక సవాల్‌గా తీసుకొని పని చేశాం. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. నా పాత్రకి తెలుగులో నేను డబ్బింగ్‌ చెప్పలేదు.

► ఒక ఇండియన్‌ అబ్బాయి బ్రిటీష్‌ అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆ ఊరి మనుషుల్లో ప్రేమ, పెళ్లి విషయాల్లో మైండ్‌ సెట్‌ వేరేగా ఉంటుంది. వారి ఆలోచనలను బ్రేక్‌ చేసే ఆలోచన చాలా ఎగై్జట్‌ చేసింది.

► నేను కథని ఎంపిక చేసుకునేటప్పుడు గత చిత్రం రిజల్ట్‌ గురించి ఆలోచించను. ప్రేక్షకులు ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఈ కథలో
కొత్తదనం ఏంటి? విమర్శకులు దీన్ని ఎలా చూస్తారు? అని ఆలోచిస్తాను. నా అభిమానులు సోషల్‌ మీడియాలో నన్ను ప్రిన్స్ అని పిలుస్తుంటారు. పైగా ప్రిన్స్‌ అన్ని భాషలకు సరిపోయే టైటిల్‌.. అందుకే ఆ పేరు పెట్టాం.

► నేను, హీరో నానిగారు ఒకేలా కనిపిస్తామని ప్రేక్షకులు చెబుతుంటారు. నానిగారు కూడా యాంకర్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేసి, హీరోగా ఎదిగారు. నేను కూడా టీవీలో పని చేసి సినిమాల్లోకి వచ్చాను. నా పదేళ్ల నట ప్రయాణంలో ప్రేక్షకులు పంచిన ప్రేమని మర్చిపోలేను.

► సునీల్‌  నారంగ్, డి.సురేష్‌ బాబు, రామ్‌మోహన్‌ రావు
కాంబినేషన్‌లోని ‘ప్రిన్స్‌’ లో భాగం కావడం హ్యాపీ. తెలుగులో రాజమౌళిగారితో మూవీ చేయాలని ఉంది. అలాగే త్రివిక్రమ్, సుకుమార్‌గార్ల సినిమాలంటే ఇష్టం. ప్రస్తుతం ‘మహావీరుడు’ సినిమా చేస్తున్నా.

భవిష్యత్‌లోనూ ద్విభాష(తెలుగు, తమిళ)చిత్రాలు చేయాలనే ఆలోచన నాకు ఉంది. ప్రస్తుతం విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లిగారు ఓ సినిమా చేస్తున్నారు. అలాగే హీరో రామ్‌ చరణ్‌– శంకర్‌గారు కలసి పని చేస్తున్నారు. తెలుగు–తమిళ పరిశ్రమల వాళ్లు కలిసి సినిమా చేయడం చాలా మంచి పరిణామం. ‘‘ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్, విక్రమ్, కాంతార’ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. దక్షిణాది పరిశ్రమ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉండటం సంతోషం.

మరిన్ని వార్తలు