చెన్నై నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వచ్చేవాణ్ణి

1 Oct, 2021 01:17 IST|Sakshi

‘జీవితం అంటే ఏంటి? మన లక్ష్యాలను చేరుకునేందుకు ఎంతలా కష్టపడాలి? అనేది ‘ఇదే మా కథ’ చిత్రంలోని సందేశం’’ అని శ్రీకాంత్‌ అన్నారు. సుమంత్‌ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌ ముఖ్య పాత్రల్లో గురు పవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్‌ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా కలిసే నలుగురు బైక్‌ రైడర్స్‌ వారి కష్టాలను ఎలా పంచుకున్నారు? ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది ‘ఇదే మా కథ’లో ఆసక్తిగా ఉంటుంది. ఇందులో మహేంద్ర పాత్ర చేశాను.

24 ఏళ్ల క్రితం మిస్‌ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లడఖ్‌కి వెళ్లే పాత్ర నాది. బైక్‌లోనే ఎందుకు వెళ్తాడు? అనేదానికి కూడా ఓ కథ ఉంటుంది. కులుమనాలి నుంచి లడఖ్‌ వరకు బైక్‌ మీద షూటింగ్‌ చేశాం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్‌ మీదే తిరిగేవాణ్ణి. చెన్నై నుంచి హైదరాబాద్‌కు కూడా బైక్‌ మీదే వచ్చేవాణ్ణి. మామూలుగా బైకర్స్‌ అంతా ఢిల్లీలో కలుస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసినవాళ్లు జీవితాంతం ఫ్రెండ్స్‌గా ఉంటుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. ‘‘సాయితేజ్‌ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు (గురువారం) కూడా తనతో మాట్లాడాను. తను నటించిన ‘రిపబ్లిక్‌’ పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు శ్రీకాంత్‌.

మరిన్ని వార్తలు