Sudheer Babu: బ్రహ్మాస్త్రలో ఛాన్స్‌ వచ్చింది కానీ చేయలేకపోయాను

10 Feb, 2022 08:45 IST|Sakshi

‘‘నటుడిగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.  ప్రతి సినిమా నుంచి ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను’’ అని సుధీర్‌బాబు అన్నారు. 2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ (ఎస్‌ఎమ్‌ఎస్‌) చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు సుధీర్‌బాబు. నేటికి (ఫిబ్రవరి 10) ఈ హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు...

ఇండస్ట్రీకి వందమంది వస్తే నలుగురే సక్సెస్‌ అవుతారు. నా కెరీర్‌లో నేను ఇప్పటివరకు 14 సినిమాలు చేశాను. నటుడిగా వందశాతం కష్టపడ్డాను. కానీ ఫలితాలు మన చేతుల్లో ఉండవు. రిలీజ్‌ డేట్, బడ్జెట్, ఆ సమయంలో ఆడియన్స్‌ మూడ్‌... ఇలా ఒక సినిమా రిజల్ట్‌కి చాలా కారణాలుంటాయి. నా కెరీర్‌లోనూ కొన్ని సినిమాలు ఆడలేదు.. ఆ అనుభవాల నుంచి తప్పులు తెలుసుకుని, వాటిని సరిదిద్దుకున్నాను. ఇప్పటికీ నా ప్రతి సినిమాను చివరి సినిమాలానే భావించి కష్టపడుతుంటాను. నటుడిగా కొంచెం ఆ భయం ఉండాలి. 

నా కెరీర్‌లో ఫస్ట్‌ ఫిల్మ్‌ ఫస్ట్‌ డే షూటింగ్‌ సమయంలో నాది ఫొటోజెనిక్‌ ఫేస్‌ కాదన్నట్లుగా కెమెరామ్యాన్, అతని అసిస్టెంట్‌ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ విషయం గురించి ఆలోచించి ఆ సినిమా కోసం నా పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచుకున్నాను. కానీ అప్పుడు ఆ కెమెరామ్యాన్‌ను ఆ సినిమా నుంచి తొలగించాను. నెగటివ్‌ ఫీలింగ్స్‌ ఉండకూడదని అలా చేశాను. ఆ తర్వాత వేరే సినిమాకి అతనితో పనిచేశాను. స్టార్టింగ్‌లో నా వాయిస్‌ విషయంలో కొంత మిశ్రమ స్పందన వచ్చింది. సంగీత దర్శ కుడు ఆర్పీ పట్నాయక్‌గారి సహకారంతో కొంత ట్యూన్‌ చేసుకోగలిగాను.

హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ అవకాశాలు రావాలంటే నటుడిగా నిరూపించుకోవాలని ‘ఏ మాయ చేసావె’, హిందీ చిత్రం ‘బాఘీ’లో నెగటివ్‌ షేడ్స్‌ పాత్రలు చేశాను. హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో అవకాశం వచ్చింది. అదే సమయంలో నాకు ‘సమ్మోహనం’ రావడంతో ‘బ్రహ్మాస్త్ర’ చేయలేకపోయాను.

కెరీర్‌ పరంగా కృష్ణగారు, మహేశ్‌ల నుంచి చాలా నేర్చుకున్నాను. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా వారు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. నేను కూడా అంతే. నాకు ఫేవర్‌ చేయమని వారినెప్పుడూ అడగలేదు. మహేశ్‌కి విలన్‌గా చేయడానికి అభ్యంతరం లేదు. కానీ మంచి కథ కుదరాలి. మహేశ్‌తో ఓ సినిమా నిర్మించాలని ఉంది.

యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. జాకీ చాన్‌కు పెద్ద అభిమానిని. నేను నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్‌కు రెడీగా ఉంది. హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. భవ్య క్రియేషన్స్‌లో ఓ మూవీ కమిటయ్యాను. ‘లూజర్‌ 2’ డైరెక్టర్‌ అభిలాష్‌ రెడ్డితో ఓ సినిమా ఉంటుంది. 

నా ఇద్దరు కుమారులు చరిత్, దర్శన్‌ సినిమాల పట్ల ఆసక్తిగానే ఉన్నారు. హర్షవర్ధన్‌ దర్శకత్వంలో నేను చేస్తోన్న సినిమాలో చరిత్‌ నా చిన్ననాటి క్యారెక్టర్‌ చేశాడు. మహేశ్‌ ‘సర్కారువారి పాట’ సినిమాలో జూనియర్‌ మహేశ్‌గా దర్శన్‌ కనిపిస్తాడు.

మరిన్ని వార్తలు