అమెజాన్‌ నెత్తిన పిడుగు: సుప్రీంకోర్టు నోటీసులు

21 Jan, 2021 15:51 IST|Sakshi

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో పరిస్థితి. ఇప్పటికే తాండవ్‌ సిరీస్‌ను వివాదాలు చుట్టుముట్టగా ఇప్పుడు మీర్జాపూర్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ ప్రాంతాన్ని హింసాత్మకంగా చూపించడంతో అక్కడ నివసించే ఓ వ్యక్తి ఈ వెబ్‌ సిరీస్‌ మీద పిల్‌ దాఖలు చేశాడు. దీంతో సుప్రీం కోర్టు గురువారం నాడు మీర్జాపూర్‌ టీమ్‌కు, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో ఇష్టారీతిన వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ కంటెంట్‌ను నియంత్రించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.(చదవండి: మీర్జాపూర్‌ 2ను బ్యాన్‌ చేయండి: మహిళా ఎంపీ)

ఇదిలావుంటే ఈ వెబ్‌సిరీస్‌పై లక్నో, మీర్జాపూర్‌లో ఇదివరకే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవగా తాజాగా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో మత, ప్రాంతీయ, సామాజిక మనోభావాలను దెబ్బతీయడంతో పాటు అక్రమ సంబంధాలను ఎక్కువ ఫోకస్‌ చేశారంటూ మీర్జాపూర్‌లోని అర్వింద్‌ చతుర్వేది పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదు మీరకు పోలీసులు సదరు వెబ్‌సిరీస్‌ నిర్మాతలతో పాటు, దాన్ని ప్రసారం చేసిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ పైనా సోమవారం నాడు కేసు నమోదు చేశారు.

కాగా అప్పట్లో ఈ సిరీస్‌ మీద మీర్జాపూర్‌ ఎంపీ అనుప్రియ పటేల్‌ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో మీర్జాపూర్‌ ప్రశాంతతకు కేంద్రంగా ఉందని, కానీ వెబ్‌ సిరీస్‌లో ఈ నగరాన్ని హింసాత్మకంగా చూపించి దాని ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. ఇక రెండు సిరీస్‌లుగా వచ్చిన మీర్జాపూర్‌లో పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, విక్రాంత్‌ మాస్సే, శ్వేత త్రిపాఠి, హర్షిత గౌర్‌ తదితరులు నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌కు కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్‌ సిద్వానీ దీన్ని నిర్మించారు. (చదవండి: హనీమూన్‌కు వెళ్లిన బిగ్‌బాస్‌ నటి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు