Suriya: ఆసక్తి రేపుతున్న సూర్య కొత్త సినిమా పోస్టర్‌.. 10 భాషల్లో విడుదల

10 Sep, 2022 12:31 IST|Sakshi

తమిళసినిమా: వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు సూర్య. తన అద్భుతమైన నటనతో సూరరై పోట్రు చిత్రానికి ఉత్తమ జాతీయ అవార్డు గెలుచుకున్న ఈయన అకాడమీ అవార్డుల కమిటీలో సభ్యుడిగానూ అరుదైన గౌరవాన్ని పొందారు. కాగా తాజాగా ఈయన తన 42వ చిత్రానికి సిద్ధమయ్యారు. బాలీవుడ్‌ బ్యూటీ దిశ పటాని ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అవుతోంది. కాగా యువీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీకృష్ణ, ప్రమోద్‌ స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత జ్ఞానవేల్‌రాజా కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈయన ఇంతకుముందు అజిత్‌ హీరోగా వీరం, విశ్వాసం, వివేకం వంటి విజయవంతమైన చిత్రాలను అదే విధంగా రజనీకాంత్‌ కథానాయకుడిగా అన్నాల్తై చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రానికి వెట్రి పళణిస్వామి ఛాయాగ్రహణం, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది.

ప్రస్తుతానికి సూర్య 42 పేరుతో నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర వర్గాలు శుక్రవారం విడుదల చేశారు. పోరాట వీరుడుగా సూర్య కనిపిస్తున్న ఈ మోషన్‌ పోస్టర్‌ ఆయన అభిమానులు విపరీతంగా అలరిస్తోంది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. చిత్ర విడుదల వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు వారు తెలిపారు.

మరిన్ని వార్తలు