సుశాంత్‌ కేసు: అర్ధరాత్రి దాటిన తర్వాత పోస్ట్‌మార్టం?

22 Aug, 2020 20:59 IST|Sakshi

సుశాంత్‌ కేసు: పోస్ట్‌మార్టం నిర్వహించినన డాక్టర్లను విచారించిన సీబీఐ!

ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురి విచారించిన సీబీఐ అధికారులు సుశాంత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్లను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వారు సంతృప్తికర సమాధానాలు చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా జూన్‌ 14న సుశాంత్‌ బాంద్రాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం అతడి భౌతిక కాయాన్ని డా. ఆర్ఎన్ కూప‌ర్ మున్సిప‌ల్ జన‌ర‌ల్ ఆసుప‌త్రికి తరలించారు. దీంతో ఐదుగురు వైద్యుల బృందం అదే రోజు అర్ధరాత్రి హడావుడిగా పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు వార్తలు వెలువడ్డాయి.(‘ఆ రోజు సుశాంత్‌ బెడ్‌రూం తాళం నేనే పగలగొట్టాను’)

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఇందుకు గల కారణాల గురించి వైద్యులను ప్రశ్నించారు. అప్పటికే ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో ముందుగా కోవిడ్‌ పరీక్ష నిర్వహించినప్పటికీ.. ఆ రిపోర్టు రాకముందే పోస్ట్‌మార్టం ఎలా చేశారని వైద్యులను అడిగారు. అయితే అందులో ఓ డాక్టర్‌ ముంబై పోలీసులు ఆదేశాల మేరకు అర్ధరాత్రి దాటిన తర్వాత తాము పని పూర్తి చేశామని చెప్పగా.. కోవిడ్‌ ఫలితం వెల్లడికాక ముందు పోస్ట్‌మార్టం నిర్వహించకూడదని ఏ ప్రొవిజన్‌లోనూ లేదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. (సహ జీవనం.. జూన్‌ 8 వరకు తనతోనే: రియా)

కాగా కూపర్‌ ఆస్పత్రి వైద్యులు సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య‌గానే ధృవీక‌రించిన విషయం తెలిసిందే. అయితే అవ‌య‌వాల్లో విష‌పూరితాలు ఉన్నాయో లేదో ప‌రీక్షించేందుకు న‌టుడి అవ‌యవాల‌ను అనంతరం జేజే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇక సుశాంత్‌ది హత్యేనంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అతడి తండ్రి కేకే సింగ్‌ అనుమతితో బిహార్‌ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరగా.. సుప్రీంకోర్టు అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కేసులో సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలిగా ఉన్నారు.

మరిన్ని వార్తలు