అరెస్ట్‌ వార్తలపై స్పందించిన సుసానే ఖాన్‌

23 Dec, 2020 11:27 IST|Sakshi

మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ముంబై విమానాశ్రయం సమీపంలోని డ్రాగన్‌ ఫ్లై క్లబ్‌లో దాడి జరిపి, కోవిడ్ నియమాలు ఉల్లంఘించినందుకు గాను ముంబై పోలీసులు 34 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో సురేశ్‌ రైనా, గురు రంధావా, సుసానే ఖాన్‌ సహా పలువురు సెలిబ్రిటీలు కూడా ఉన్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో మునిసిపాలిటీల పరిధిలో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ఆదేశాలు జారీచేసింది. వాటి ప్రకారం నైట్‌ క్లబ్‌లు, పబ్‌లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేయాలి. అయితే అందుకు విరుద్ధంగా అర్ధరాత్రి తర్వాత కూడా క్లబ్‌ను తెరిచి ఉంచినందుకు నిర్వాహకులను, కోవిడ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకుగాను అక్కడ ఉన్నా 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 27 మంది కస్టమర్లు ఉండగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో సుసానే ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారనే వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె‌ స్పందించారు.

తనను అరెస్ట్‌ చేశారంటూ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు సుసానే ఖాన్‌. దీని గురించి తమను లేదా క్లబ్‌ యాజమాన్యాన్ని సంప్రదించకుండా ఊహాగానాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ నుంచి ప్రకటన వచ్చే వరకు ఆగరు.. స్వయంగా వారే ఎంక్వైరీ చేయ్యరు. ఏది తోస్తే అది రాస్తారు.. ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తారో తనకు అర్థం కావడం లేదన్నారు సుసానే ఖాన్‌. ఇక దీని గురించి తానే స్వయంగా వివరణ ఇవ్వాలని భావించానని వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశారు సుసానే ఖాన్‌. దీనిలో ఆమె ‘గత రాత్రి క్లోజ్‌ ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో భాగంగా సహార్‌ జేడబ్ల్యూ మారియట్‌లోని డ్రాగన్‌ ఫ్లై క్లబ్‌కి వెళ్లాం. పార్టీ టైం కాస్త ఎక్స్‌టెండ్‌ అయ్యింది. ఉదయం 2.30గంటల సమయంలో అధికారులు క్లబ్‌లోకి వచ్చారు. యాజమాన్యాన్ని పిలిచి కొత్త కర్ఫ్యూ నియమాలు గురించి చెప్పి.. ఇంతసేపు ఎందుకు ఒపెన్‌ చేసి ఉంచారనే తదితర విషయాల గురించి ఎంక్వైరీ చేశారు. అక్కడ ఉన్న వారందరని మరో మూడు గంటల పాటు వెయిట్‌ చేయాల్సిందిగా కోరారు. ఉదయం 6 గంటలకి మమ్మల్ని బయటకు పంపిచారు. ఇది వాస్తవంగా జరిగింది. ఇక మీడియాలో నేను అరెస్ట్‌ అయ్యానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా బాద్యతారహితమైనవి.. అవాస్తవాలు’ అని పేర్కొన్నారు సుసానే. (చదవండి: రైనా, టాప్‌ హీరో మాజీ భార్య అరెస్ట్)

A post shared by Sussanne Khan (@suzkr)

ఇక ఇందుకు సంబంధించి గురు రంధావా కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. గత రాత్రి జరిగిన సంఘటనకు తాను ఎంతో బాధపడుతున్నానని... కొత్త కర్ఫ్యూ నియమాల గురించి తనకు తెలియదని.. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని దానిలో వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తానని తెలిపారు. 

మరిన్ని వార్తలు