Tollywood-Bollywood: ‘కి’ రోల్స్‌కి సై అంటున్న మన స్టార్‌ హీరోలు

17 May, 2022 08:20 IST|Sakshi

హీరో ఎప్పుడూ హీరోగానే చేయాలా? ‘కీ రోల్‌’లో కనిపించకూడదా? ‘ఎందుకు కూడదూ’ అంటున్నారు కొందరు టాప్‌ హీరోలు.. అందుకే హీరోగా తమ చేతుల్లో సినిమాలు ఉన్నా కీ రోల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆ హీరోల్‌ చేస్తున్న కీ రోల్‌ గురించి తెలుసుకుందాం. 

గతంలో హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన నాగార్జున చాలా గ్యాప్‌ తర్వాత చేసిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జునది కీ రోల్‌. ఇందులో రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లు. మూడు భాగాలుగా రానున్న ఈ ‘బ్రహ్మాస్త్ర’ తెలుగులో రాజమౌళి సమర్పణలో ‘బ్రహ్మాస్త్రం’గా వస్తోంది. ‘బ్రహ్మాస్త్రం’ తొలి భాగం ‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబరు 9న రిలీజ్‌ కానుంది. ఇక నాగ్‌ హీరోగా చేస్తున్న ‘ఘోస్ట్‌’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ‘బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్‌’కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

నాగార్జునలానే గతంలో వెంకటేశ్‌ హిందీ చిత్రాల్లో హీరోగా నటించారు. ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’లో చేస్తున్న కీ రోల్‌తో చాలా గ్యాప్‌ తర్వాత బాలీవుడ్‌ ప్రేక్షకులకు హాయ్‌ చెబుతున్నారు వెంకటేశ్‌. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 30న రిలీజ్‌ కానుంది. ఇక హీరోగా వెంకటేశ్‌ నటించిన ‘ఎఫ్‌ 3’ ఈ నెల 27న రిలీజ్‌ కానుండగా వెంకీ చేస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ చిత్రీకరణలో ఉంది.

మరోవైపు హీరోగా రవితేజ నాలుగు సినిమాలు చేస్తున్నారు. అయినప్పటికీ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ఓ కీలక పాత్రకు ఊ కొట్టారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఇందులో చిరంజీవికి తమ్ముడి పాత్రలో కనిపిస్తారట రవితేజ. ఇదే నిజమైతే... ‘అన్నయ్య’ (2000) చిత్రంలో చిరంజీవి తమ్ముడి పాత్రను చేసిన రవితేజ మరోసారి చిరూకి తమ్ముడిగా కనిపించినట్లు అవుతుంది.

ఇక బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’లో ఓ స్పెషల్‌ రోల్‌ చేశారు. ఈ సీనియర్‌ హీరోలు ఇలా కీలక పాత్రలు చేస్తుంటే యంగ్‌ హీరో నాగచైతన్య కూడా ఆ తరహా పాత్రలో కనిపించనున్నారు. హిందీ ‘లాల్‌సింగ్‌ చద్దా’లో కీలక పాత్ర చేశారు నాగచైతన్య. ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌లో అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఇంకోవైపు మలయాళ స్టార్స్‌ మమ్ముట్టి, పృథ్వీరాజ్‌ కూడా కీలక పాత్రలు చేస్తున్నవారి లిస్ట్‌లో ఉన్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్‌’లో మమ్ముట్టి కీ రోల్‌ చేస్తుండగా, ప్రభాస్‌ హీరోగా చేస్తున్న పాన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ చేస్తున్న తెలుగు స్ట్రయిట్‌ ఫిల్మ్‌ ‘సీతారామం’లో సుమంత్‌ ఓ కీ రోల్‌ చేశారు. సుమంత్‌ హీరోగా చేసిన ‘వాల్తేరు శీను’, ‘అహం రీబూట్‌’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్‌ ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్రకు ఓకే చెప్పారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ దర్శకుడు. అటు హిందీలో అక్షయ్‌ కుమార్‌ ‘రామ సేతు’లో కీ రోల్‌ చేశారు సత్యదేవ్‌. అలాగే చిరంజీవి ‘ఆచార్య’లో అతిథి పాత్ర చేసిన సత్యదేవ్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ లోనూ కీ రోల్‌ చేశారు. సత్యదేవ్‌ హీరోగా చేసిన ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’ రిలీజ్‌కి రెడీ అవు తున్నాయి. ఇక హీరోగా ఫామ్‌లోకి వస్తున్న విశ్వక్‌ సేన్‌ ‘ముఖచిత్రం’లో కీ రోల్‌ చేశారు.

గంగాధర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వికాస్‌ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యరావ్, అయేషా ఖాన్‌ ముఖ్య తారలు. విశ్వక్‌ ప్రస్తుతం ‘గామీ’, ‘ఓరి.. దేవుడా’, ‘దాస్‌కీ దమ్కీ’ చిత్రాల్లో హీరోగా చేస్తున్నారు. సీనియర్‌ హీరోలు, యంగ్‌ హీరోలు ఇలా ‘కీరోల్స్‌’ చేయడం మంచి పరిణామం. ఎలానూ ఆ సినిమా హీరోకి ఉన్న స్టార్‌డమ్‌ వల్ల ఆ చిత్రంపై అంచనాలు ఉంటాయి. అదే సినిమాలో ఇంకో హీరో కీ రోల్‌లో కనబడితే అదనపు బలం చేకూరుతుంది. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా ‘కీ రోల్స్‌’ చేసేందుకు రెడీ అంటున్నారు.   

మరిన్ని వార్తలు