ఒకప్పుడు హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు.. మళ్లీ హీరోలుగా!

28 Apr, 2023 03:50 IST|Sakshi

టాలీవుడ్‌లో టాప్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఎవరంటే సీనియర్లలో రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, రావు రమేశ్, మురళీ శర్మ ఉంటారు. మంచి క్యారెక్టర్లు చేస్తున్న ఈ నటుల్లో రాజేంద్రప్రసాద్, నరేశ్‌ ఒకప్పుడు హీరోలుగా చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్న రావు రమేశ్‌ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. ‘వీళ్లే చేయాలి’ అనే తరహా లీడ్‌ రోల్స్‌లో ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్‌ నటిస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా మంచి పాత్రలు చేస్తున్న ఈ ముగ్గురూ ‘క్యారెక్టర్‌ హీరో’గా చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

రాజేంద్రప్రసాద్‌ షష్టిపూర్తి
తెలుగులో హాస్య కథా చిత్రాల హీరో అనగానే రాజేంద్ర ప్రసాద్‌ గుర్తుకొస్తారు. హీరోగా ప్రేక్షకులపై వినోదాల జల్లులు కురిపించిన ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో దూసుకెళుతున్నారు. అడపా దడపా లీడ్‌ రోల్స్‌ కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్‌. ఆయన లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌కి జోడీగా అర్చన నటిస్తున్నారు. ‘లేడీస్‌ టైలర్‌’ (1986) తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. షష్టిపూర్తి కథాంశంతో న్యూ ఏజ్‌ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రూపేష్‌ కుమార్‌ చౌదరి మరో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు.  ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలైలో రిలీజ్‌ కానుంది.

వీకే నరేశ్‌ మళ్ళీ పెళ్లి
హీరోగా వీకే నరేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన హాస్యం, నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉంటున్నారు. కాగా నరేశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, పవిత్రా లోకేశ్‌ జంటగా నటించారు. విజయకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై వీకే నరేశ్‌ స్వయంగా ఈ  చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘మళ్ళీ పెళ్లి’, కన్నడలో ‘మత్తే మధువే’ టైటిల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మేలో ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఉరిమే కాలమా..’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, అనురాగ్‌ కులకర్ణి పాడారు.

మారుతీనగర్‌లో రావు రమేశ్‌
విలక్షణమైన డైలాగ్‌ డెలివరీతో తనదైన శైలిలో విలనిజాన్ని పండించిన గొప్ప నటుడు రావు గోపాలరావు. తండ్రి వారసత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిచయమయ్యారు ఆయన తనయుడు రావు రమేశ్‌. విలన్, కమెడియన్, తండ్రి.. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు రావు రమేశ్‌.

‘హ్యాపీ వెడ్డింగ్‌’ ఫేమ్‌ లక్ష్మణ్‌ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావు రమేశ్‌కి జోడీగా ఇంద్రజ నటిస్తున్నారు. పీబీఆర్‌ సినిమాస్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి పాత్రలో రావు రమేశ్‌ కనిపిస్తారు. ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశం. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్‌ తొలిసారి కథను నడిపే నాయకునిగా చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు కథానాయకులుగా చేస్తున్న ఈ మూడు చిత్రాలు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా నిలిచాయి.

మరిన్ని వార్తలు