సౌత్‌ ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోయిన్‌ ఎవరంటే..

1 Oct, 2023 08:00 IST|Sakshi

సినీరంగంలో ఒక వ్యక్తికి 60 ఏళ్లు వచ్చినా తనదైన మార్కెట్‌తో దూసుకుపోతుంటారు. వారు ఇద్దరు పిల్లలకు తండ్రి అయినా కూడా సినిమా ఛాన్స్‌లు వస్తుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా సినీరంగంలో పనిచేసే వారే చాలాసార్లు చెప్తుంటారు. సినిమాల్లో మగవాళ్లలా నటీమణులు కనీసం 40, 50 ఏళ్లు కూడా ఉండలేరు. ఒకవేళ ఉన్నా సపోర్టింగ్ రోల్స్‌లలో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ వారు పెళ్లి చేసుకుంటే సినిమాల్లో మార్కెట్ పడిపోతుంది. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కొన్ని సంవత్సరాలుగా నిరంతరం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్లుగా ఇంకా తమ సత్తా చాటుతున్నారు.

త్రిష, నయనతార వంటి నటీమణులను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ 20 ఏళ్లకు పైగా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకానీ సపోర్టింగ్ రోల్స్ లో నటించడం లేదు. అనేక భారీ బడ్జెట్, పాన్-ఇండియన్ చిత్రాలలో ఇటీవలి కాలంలో హీరోలతో సమానంగా వారు కూడా రెరమ్యునరేషన్‌ పొందుతున్నారు. వీళ్లు రూ. 10 నుంచి 11 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటారని టాక్‌. ఒక సినిమాకు రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ అందుకున్న  తొలి దక్షిణ భారత నటిగా నయనతారకు గుర్తింపు ఉంది. 

అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి మరోకరు ఉన్నారు. ఆమె మరెవరో కాదు నటి త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి త్రిష. ప్రస్తుతం నయనతార పారితోషికం కంటే త్రిష ఎక్కువ తీసుకుంటున్నట్లు టాక్‌. దీనికి ప్రధాన కారణం త్రిష నటనా ప్రావీణ్యంతో పాటు.. 40 ఏళ్లు దాటినా యూత్ ఫుల్ అందం అని చెప్పవచ్చు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో నటించినందుకు త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.  ఇదే విషయం గూగుల్‌ కూడా తెలుపుతుంది.

త్రిషకు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు నిర్మాతలు కూడా ముందుకొచ్చారని తెలుస్తోంది. దీంతో సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి త్రిష అని పరిగణనలోకి తీసుకుంటే, నయనతార రెమ్యూనరేషన్ పెద్దగా తగ్గలేదు. జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార ఈ సినిమా కోసం 11 కోట్ల పారితోషికం తీసుకుందట. రెమ్యునరేషన్ పరంగా అనుష్క శెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆమె పారితోషికం రూ.6 కోట్లు. అనుష్క ప్రస్తుతం తెలుగు, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. 

సమంత రూ.6 నుంచి 8 కోట్లు ఒక సినిమాతో సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద, శకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. పూజా హెగ్డే సౌత్ ఇండియన్ బిజీ నటీమణులలో ఒకరు. పూజా హెగ్డే ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. రష్మిక మందన ఒక్కో సినిమాకు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.

జైలర్ ద్వారా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. రూ. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఒక సినిమా కోసం ఒకటిన్నర నుంచి నాలుగు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నటి ఏడాది క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకు 1.5 నుంచి 3.5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. నివేదికల ప్రకారం, కీర్తి సురేష్ ఒక సినిమాకు రూ.2.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు సరైన హిట్‌ దక్కలేదు.

మరిన్ని వార్తలు