ఇద్దరు మిత్రులు శత్రువులు అయితే అనేదే 'సలార్‌'

8 Dec, 2023 06:40 IST|Sakshi

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ కెరీర్‌కు చాలా ముఖ్యమైన చిత్రం సలార్‌. ఎందుకంటే బాహుబలి రెండు చిత్రాల తరువాత డార్లింగ్‌ నటించిన రాధేశ్యామ్‌, ఆదిపుష్‌ చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కినప్పటికీ పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో తాజా చిత్రం సలార్‌తో కచ్చితంగా హిట్‌ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభాస్‌పై పడింది. ఇక ఈ చిత్రం హీరోయిన్‌ శృతిహాసన్‌ సలార్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరో ప్రధాన పాత్రలో మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్‌ నటించడం విశేషం. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఇందులో తమిళ నటుడు పశుపతి కూడా కీలక పాత్రను పోషించారు.

కెజీఎఫ్‌ చిత్రం ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోమ్‌ బలే సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన భారీ అంచనాల నడుమ తెరపైకి రానున్న సలార్‌ చిత్రం గురించి దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఇది ఇద్దరు మిత్రుల ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. అయితే ఆ ఇద్దరు శత్రువులుగా మారితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం ఇదని చెప్పారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు.

గత చిత్రం కేజీఎఫ్‌ ఛాయలు సలార్‌లో కనిపిస్తున్నాయనే వాదన కరెక్ట్‌ కాదన్నారు. ఆ చిత్రంకు సలార్‌ అస్సలు పోలిక ఉండదన్నారు. ఇంకా చెప్పాలంటే కేజీఎఫ్‌ చిత్రాన్ని రూపొందించడానికి ముందే సలార్‌ చిత్ర కథను రాసుకున్నానని చెప్పారు. అదే విధంగా సలార్‌ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్‌ ఉంటుందని, త్వరలోనే సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రశాంత్‌ నీల్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు